Vinfast: భారత్‌లో తొలి తయారీ ప్లాంట్ ప్రారంభించిన విన్‌ఫాస్ట్

by S Gopi |

తూత్తుకుడిలోని ప్లాంటు అధునాతన ఆటోమేషన్, టెక్నాలజీ ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సిద్ధంగా ఉంది.

Vinfast: భారత్‌లో తొలి తయారీ ప్లాంట్ ప్రారంభించిన విన్‌ఫాస్ట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: వియత్నాం ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్లో దూకుడుగా వ్యవహరిస్తోంది. వారం రోజుల క్రితమే మనదేశంలో మొదటి షోరూమ్‌ను ఏర్పాటు చేసిన కంపెనీ సోమవారం తన తొలి తయారీ ప్లాంటును ప్రారంభించింది. తమిళనాడులోని తూత్తుకుడిలో రూ. 16,000 కోట్లతో దీన్ని మొదలుపెట్టింది. ఇది ప్రపంచంలోనే కంపెనీకి చెందిన మూడో ప్లాంట్ కావడం గమనార్హం. ప్రారంభంలో ఈ ప్లాంట్ నుంచి విన్‌ఫాస్ట్ ప్రీమియం ఎస్‌యూవీ మోడళ్లు వీఎఫ్7, వీఎఫ్6 అసెంబుల్ చేయనున్నారు. మొదటి సంవత్సరంలో 50,000 కార్లను, మార్కెట్ డిమాండ్ ఆధారంగా ఏటా 1.50 లక్షల యూనిట్లను తయారు చేయాలని భావిస్తున్నట్టు విన్‌ఫాస్ట్ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ అన్నారు. ప్రపంచ ఈవీ పరిశ్రమ భవిష్యత్తులో ఈ ప్లాంటు కీలకపాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నాం. తూత్తుకుడిలోని ప్లాంటు అధునాతన ఆటోమేషన్, టెక్నాలజీ ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సిద్ధంగా ఉంది. భారత వినియోగదారులకు అధిక-నాణ్యత, పోటీ ధరలకు ఎలక్ట్రిక్ వాహనాలను అందించే లక్ష్యంతో ఉన్నామని సాన్ చౌ తెలిపారు. పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే ఈ ప్లాంటు 3,000-3,500 ప్రత్యక్ష ఉద్యోగాలను, సరఫరాలో పరోక్షంగా మరెంతో మందికి ఉపాధిని కల్పిస్తుంది.

మరోవైపు, తూత్తుకుడి ప్లాంటుతో పాటు దక్షిణాదిన మరో తయారీ యూనిట్‌ ఏర్పాటు కోసం విన్‌ఫాస్ట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోంది. మరింత విస్తరణ ప్రణాళికలో భాగంగా తమిళనాడుతో పాటు తెలంగాణ, ఏపీలోనూ ప్లాంటు ఉండాలని భావిస్తున్నామని సాన్ చౌ చెప్పారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నాం, మౌలిక సదుపాయాలు, ఇతర అంశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Next Story