Adani: గౌతమ్ అదానీకి అమెరికాలో భారీ ఊరట

by S Gopi |

న్యూయార్క్‌లో కొనసాగుతున్న హై-ప్రొఫైల్ సెక్యూరిటీస్, వైర్ ఫ్రాడ్ కేసులో ఉన్న అన్ని క్రిమినల్ ఆరోపణలను అమెరికా న్యాయ శాఖ సోమవారం శాశ్వతంగా ఉపసంహరించుకుంది.

Adani: గౌతమ్ అదానీకి అమెరికాలో భారీ ఊరట
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీకి అమెరికాలో భారీ ఉపశమనం లభించింది. న్యూయార్క్‌లో కొనసాగుతున్న హై-ప్రొఫైల్ సెక్యూరిటీస్, వైర్ ఫ్రాడ్ కేసులో ఉన్న అన్ని క్రిమినల్ ఆరోపణలను అమెరికా న్యాయ శాఖ సోమవారం శాశ్వతంగా ఉపసంహరించుకుంది. ఆరోపణలను కోర్టులో నిలబెట్టేందుకు తగిన ఆధారాలు లేవని ప్రాసిక్యూటర్లు నిర్ధారణకు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో గత కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన అదానీ గ్రూప్‌కు సంబంధించిన యూఎస్ నియంత్రణ, న్యాయపరమైన దర్యాప్తులు అన్నీ ముగిశాయి. గత వారం, భారత్‌లోని సోలార్ ప్రాజెక్టులకు సంబంధించి అమెరికా ఇన్వెస్టర్లకు వెల్లడించిన సమాచారం విషయంలో అదానీ, ఆయన సోదరుడి కుమారుడైన సాగర్‌ అదానీపై వచ్చిన ఆరోపణలను యూఎస్‌ ఎస్‌ఈసీ సెటిల్‌ చేసిన సంగతి తెలిసిందే. కోర్టులో దాఖలు చేసిన పత్రాల ప్రకారం, గౌతమ్ అదానీ ఎలాంటి తప్పు చేయలేదని లేదా తప్పు ఒప్పుకోలేదని చెబుతూనే, 6 మిలియన్ డాలర్లు(రూ.57 కోట్లు), సాగర్‌ అదానీ 12 మిలియన్ డాలర్లు(సుమారు రూ.114 కోట్లు) చెల్లించడానికి అంగీకరించారు.

ఇదే సమయంలో..ఇరాన్ ఆంక్షల ఉల్లంఘనలపై ట్రెజరీ శాఖ దర్యాప్తు వ్యవహారంలోనూ సెటిల్‌మెంట్ జరిగినట్టు అధికారులు వెల్లడించారు. అమెరికా ట్రెజరీ శాఖకు చెందిన ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్(ఓఎఫ్ఏసీ) కేసులో అదానీ ఎంటర్‌ప్రైజెస్ 2023, నవంబర్ నుంచి 2025, జూన్ మధ్య దిగుమతి చేసిన ఎల్‌పీజీ వాస్తవానికి ఇరాన్‌ నుంచే వచ్చిందని ఓఎఫ్ఏసీ ఆరోపించింది. అమెరికా విధించిన ఇరాన్ ఆంక్షలను 32 సార్లు ఉల్లంఘించినట్లు పేర్కొంది. ఈ వ్యవహారాన్ని కోర్టు వరకు తీసుకెళ్లకుండా ముగించేందుకు అదానీ ఎంటర్‌ప్రైజెస్ 275 మిలియన్ డాలర్ల సెటిల్‌మెంట్‌కు అంగీకరించింది. అయితే దర్యాప్తులో సంస్థ పూర్తిగా సహకరించిందని ఓఎఫ్ఏసీ స్పష్టం చేసింది.

Next Story