- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
US-China: టారిఫ్‌లను 115 శాతం తగ్గిస్తూ అమెరికా, చైనా నిర్ణయం
వాణిజ్య యుద్ధానికి చైనా, అమెరికా 90 రోజుల విరామం ఇస్తూ, పరస్పర సుంకాలను 115 శాతం తగ్గించాలని నిర్ణయించాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ఒకరిపై ఒకరు సుంకాలను విధిస్తూ ప్రపంచ మార్కెట్లతో పాటు చాలా ద్శాలను బెంబెలెత్తించిన అమెరికా, చైనాలు వాణిజ్య యుద్ధానికి విరామం ప్రకటించాయి. ప్రపంచ ఆర్థికవ్యవస్థను దెబ్బతీసే ముప్పు పొంచి ఉన్న ఈ వాణిజ్య యుద్ధానికి చైనా, అమెరికా 90 రోజుల విరామం ఇస్తూ, పరస్పర సుంకాలను 115 శాతం తగ్గించాలని నిర్ణయించాయి. ఈ మేరకు జెనీవాలో చర్చల అనంతరం అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ మాట్లాడుతూ.. ఇరు దేశాలు స్విట్జర్లాండ్ కేంద్రంగా జరిగిన చర్చల్లో పరస్పర గౌరవంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. రెండు దేశాల ప్రతినిధుల ఏకాభిప్రాయానికి వచ్చి, ఈ అంశాన్ని మరింత జటిలం చేయకుండా చూశారు. ఫలితంగా అమెరికా, చైనా 115 శాతం చొప్పున సుంకం తగ్గింపునకు అంగీకరించాయి. తద్వారా అమెరికా ఉత్పత్తులపై చైనా 10 శాతానికి, చైనా ఉత్పత్తులపై అమెరికా 30 శాతానికి సుంకాన్ని తగ్గించాయని చెప్పారు.
ఇదే సందర్భంలో చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి.. ఈ చర్య రెండు దేశాల్లోని కంపెనీలు, ప్రజలకు సానుకూలంగా ఉంటుంది. ఇరు దేశాల ప్రయోజనాలతో పాటు ప్రపంచ ఉమ్మడి ప్రయోజనాలను నెరవేరుస్తుందని తెలిపారు. అలాగే, ఈ సమావేశం ద్వారా అమెరికా, చైనా కలిసి నడుస్తాయన్నారు. ఏకపక్ష సుంకాల తీరును ఇది సరిదిద్దుతుందని, పరస్పర ప్రయోజనాల కోసం మరింత బలమైన సహకారానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు. కాగా, తమపై చాలా దేశాలు ఎక్కువ పన్నులు విధిస్తున్నాయనే కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రుంప్ భారీ పరస్పర టారిఫ్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే చైనాపై అత్యధిక టారిఫ్ విధించారు. చైనా ఉత్పత్తులపై అమెరికా 145 శాతానికి, చైనా అమెరికా దిగుమతులపై 125 శాతం వరకు పన్నులను పెంచుతూ పోయాయి. దీనివల్ల చాలా దేశాల స్టాక్ మార్కెట్లతో పాటు ప్రపంచ ఆర్థిక మాంద్యం తప్పదనే ఆందోళనలు పెరిగాయి. దీనికి పరిష్కారం కోసం తాజాగా అమెరికా, చైనా ప్రతినిధులు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో వాణిజ్య చర్చలు నిర్వహించారు.






