- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Adani: గౌతమ్ అదానీకి బిగ్ రిలీఫ్
ఎస్ఈసీ దాఖలు చేసిన సివిల్ మోసం కేసును కూడా పరిష్కరించే దిశగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ బిలియనీర్ గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన మోసం ఆరోపణల కేసులు త్వరలో ముగిసే అవకాశమున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇదే నిజమైతే అదానీ గ్రూప్‌నకు అతిపెద్ద ఊరట కానుంది. అమెరికా న్యాయ శాఖ ఈ వారంలో క్రిమినల్ ఆరోపణలను ఉపసంహరించుకునే అవకాశముందని సంబంధిత వర్గాలు చెప్పినట్టు బ్లూమ్‌బర్గ్ తన కథనంలో పేర్కొంది. ఇదే సమయంలో, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) దాఖలు చేసిన సివిల్ మోసం కేసును కూడా పరిష్కరించే దిశగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అమెరికాలో గౌతమ్ అదానీపై 2024, నవంబర్‌లో అభియోగాలు నమోదయ్యాయి. అదానీ సంస్థ, దాని అనుబంధ కంపెనీలు సౌర విద్యుత్ ప్రాజెక్టుల కాంట్రాక్టులు పొందడానికి భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్లు లంచాలు ఆఫర్ చేసినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఆ విషయాన్ని అమెరికన్ పెట్టుబడిదారుల నుంచి దాచిపెట్టారని అధికారులు ఆరోపించారు. అయితే అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను మొదటి నుంచి ఖండిస్తూ వస్తోంది. అదానీ, ఇతర నిందితులు అమెరికాలో లేకపోవడంతో ఈ కేసు విచారణ పెద్దగా ముందుకు సాగలేదు.
గత రెండేళ్లుగా వివాదాలు, విచారణల కారణంగా గ్లోబల్ ఇన్వెస్టర్లలో విశ్వాసం కోల్పోయిన అదానీ గ్రూప్‌నకు ఈ పరిణామం సహాయపడవచ్చు. ముఖ్యంగా విదేశీ పెట్టుబడులను సేకరించడం, అంతర్జాతీయ బాండ్ మార్కెట్లలోకి తిరిగి రావడం, భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు సమీకరించడం వంటి అంశాల్లో అదానీ సంస్థకు ఇది కీలక మలుపు కావొచ్చు. అయితే, ఈ పరిణామం పూర్తిగా అదానీకి ‘క్లీన్ చిట్’ లభించిందనే అర్థం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎస్ఈసీ తరఫున జరిమానా లేదా ఇతర షరతులతో కూడిన సెటిల్‌మెంట్ జరగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ, క్రిమినల్ కేసులు వెనక్కి తీసుకుంటే అదానీ గ్రూప్‌పై ఉన్న అంతర్జాతీయ ఒత్తిడి తగ్గనుంది.






