Economy: ఈ ఏడాదిలోనూ అత్యంత వేగవంతమైన ఆర్థికవ్యవస్థగా భారత్

by S Gopi |

భారత్ మిగిలిన దేశాల కంటే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా 6.3 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపింది.

Economy: ఈ ఏడాదిలోనూ అత్యంత వేగవంతమైన ఆర్థికవ్యవస్థగా భారత్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయ పరిణామాల మధ్య అనేక ఆర్థికవ్యవస్థలు వృద్ధిలో వెనుకబడ్డాయి. అయితే, ప్రపంచ ఆర్థికవ్యవస్థ అస్థిరంగా ఉన్నప్పటికీ భారత్ వృద్ధిలో దూసుకెళ్తుందని ఐక్యరాజ్యసమితి శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది. ఈ ఏడాది కూడా భారత్ మిగిలిన దేశాల కంటే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థికవ్యవస్థగా 6.3 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపింది. దేశంలో వినియోగ వ్యయం బలంగా ఉండటంతో పాటు ప్రభుత్వం పెట్టుబడులు కొనసాగుతుండటం, కీలకమైన సేవల ఎగుమతులు మెరుగ్గా ఉండటంతో వృద్ధికి దోహదపడనున్నాయి. అయితే, ఇటీవల నెలకొన్న భారత్, పాక్ ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ వాణిజ్య సవాళ్ల కారణంగా జనవరిలో అంచనా వేసిన 6.6 శాతం కంటే కంటే తగ్గినప్పటికీ, భారత్ ఇప్పటికీ ఇతర పెద్ద ఆర్థికవ్యవస్థల కంటే ముందుంది. వచ్చే ఏడాదికి కూడా భారత జీడీపీ 6.4 శాతం మెరుగవుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా కట్టింది. మరోవైపు, భారత్‌లో ద్రవ్యోల్బణం కూడా తగ్గుముఖం పడుతోంది. 2024లో 4.9 శాతం నుంచి 2025కి సంబంధించి 4.3 శాతానికి దిగి రానుంది. భారత్‌తో పోలిస్తే చైనా వృద్ధి 4.6 శాతం, అమెరికా 1.6 శాతం, జపాన్ 0.7 శాతం, ఈయూ 1 శాతంతో సరిపెడతాయని పేర్కొంది. ఇదే సమయంలో ప్రపంచ ఆర్థికవ్యవస్థ ప్రమాదకర స్థాయిలో ఉంది. పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్త పరిస్థితులు, పాలసీ విధానాల్లో అనిశ్చితి కారణంగా ప్రపంచ వృద్ధిపై ఎక్కువ ఒత్తిడి కనిపిస్తోందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

Next Story