Reciprocal Tariff: ట్రంప్ ఏప్రిల్ 2 డెడ్‌లైన్ కారణంగా ఏటా రూ. 60 వేల కోట్ల భారం

by S Gopi |   (  Updated:2025-03-05 15:05:42  IST  )

ఈ ప్రభావం వాహనాల నుంచి వ్యవసాయం వరకు కీలక ఎగుమతి రంగాలపై ఉంటుందని తెలిపారు.

Reciprocal Tariff: ట్రంప్ ఏప్రిల్ 2 డెడ్‌లైన్ కారణంగా ఏటా రూ. 60 వేల కోట్ల భారం
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెసిప్రోకల్ టారిఫ్ అంశాన్ని ప్రస్తావించారు. యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తూ.. ఇతర దేశాలు దశాబ్దాలుగా అమెరికాపై అధిక సుంకాలతో ప్రయోజనాలు పొందాయి. ఇప్పుడు వాటిని ఆయా దేశాలపై విధించడం తమ వంతు. సగటున యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, ఇండియా, మెక్సికో, కెనడా దేశాలు లెక్కలేనన్ని సార్లు 100 శాతం కంటే ఎక్కువ సుంకాలు విధించాయన్నారు. ఇండియాపై ఏప్రిల్ 2 నుంచి పరస్పర సుంకాలు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్ కారణంగా భారత్ ఏటా రూ. 60.88 వేల కోట్ల నష్టాలు ఏర్పడవచ్చని సిటీ రీసెర్చ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రభావం వాహనాల నుంచి వ్యవసాయం వరకు కీలక ఎగుమతి రంగాలపై ఉంటుందని తెలిపారు. రెసిప్రోకల్ టారిఫ్ అమలు కారణంగా కెమికల్స్, మెటల్, ఆభరణాల ఉత్పత్తులు ఎక్క్కువ దెబ్బతినవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీటి తర్వాత ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్, ఆహార ఉత్పత్తులు ఎక్కువ ప్రభావితం కానున్నాయి. 2023 డేటా ప్రకారం, అమెరికా ఉత్పత్తులపై భారత్ దాదాపు 11 శాతం సగటు టారిఫ్‌ను వసూలు చేసింది. భారత ఎగుమతులపై అమెరికా సుంకాల కంటే దాదాపు 8 శాతం ఎక్కువ అమలవుతోందని విశ్లేషకులు వెల్లడించారు. కాగా, 2024లో భారత్ నుంచి అమెరికాకు దాదాపు 74 బిలియన్ డాలర్ల(రూ. 6.43 లక్షల కోట్లు) వస్తువుల ఎగుమతులు జరిగాయి. ఇందులో రూ. 73.85 వేల కోట్ల విలువైన ముత్యాలు, రత్నాభరణాలు, రూ. 69.47 వేల కోట్ల విలువైన ఫార్మాస్యూటికల్స్, సుమారు రూ. 34.75 వేల కోట్ల విలువైన పెట్రోకెమికల్స్ ఉత్పత్తులు ఉన్నాయి. అదే ఏడాది అమెరికా నుంచి భారత్‌కు రూ. 3.65 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. ఇందులో కలప ఉత్పత్తులు, యంత్రాలపై 7 శాతం, పాదరక్షలు, రవాణా పరికరాలపై 15-20 శాతం, ఆహార పదార్థాలపై దాదాపు 68 శాతం వరకు అధిక సుంకాలు అమలవుతున్నాయి.

Next Story