పర్సనల్ లోన్లలో ఎన్ఎఫ్ బీసీల హవా

by velandi.Saikiran |

దేశంలో డిజిటల్ రుణాలు వేగంగా పెరుగుతున్నాయి. వ్యక్తిగత రుణాల విభాగంలో డిజిటల్ ఎన్‌బీఎఫ్‌సీలు ఆధిపత్యం

పర్సనల్ లోన్లలో ఎన్ఎఫ్ బీసీల హవా
X

రూ. 97,381 కోట్లు

పర్సనల్ లోన్లలో ఎన్ఎఫ్ బీసీల హవా

2025-26 ప్రథమార్థంలో 80 శాతం ఆన్ లైన్ రుణాలే

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో డిజిటల్ రుణాలు వేగంగా పెరుగుతున్నాయి. వ్యక్తిగత రుణాల విభాగంలో డిజిటల్ ఎన్‌బీఎఫ్‌సీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఫిన్‌టెక్ అసోసియేషన్ ఫర్ కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ (ఫేస్) తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో మొత్తం 6.4 కోట్ల డిజిటల్ పర్సనల్ రుణాలు మంజూరు అయ్యాయి. వీటి విలువ రూ. 97,381 కోట్లు. ఇది మొత్తం వ్యక్తిగత రుణాల్లో 19 శాతానికి సమానం కావడం గమనార్హం. సంఖ్యాపరంగా కూడా మొత్తం పర్సనల్ లోన్లలో 80 శాతం డిజిటల్‌గా జారీ అయ్యాయి. గతేడాది ఇదే సమయంలో 5.9 కోట్ల డిజిటల్ పర్సనల్ లోన్లు ఇవ్వగా, వాటి విలువ రూ. 78,084 కోట్లు. ఇది ఆర్థిక సంస్థలు డిజిటల్ రుణాలివ్వడంలో డిమాండ్‌ను, కస్టమర్ల విశ్వాసాన్ని, మెరుగైన క్రెడిట్ హిస్టరీని సూచిస్తుందని సీఆర్ఐఎఫ్ హై మార్క్ డేటా అభిప్రాయపడింది. డిజిటల్ రుణాలకు సంబంధించి సగటు లోన్ రూ. 13,327 నుంచి రూ. 15,177కు పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 5.99 కోట్ల యాక్టివ్ అకౌంట్లలో బకాయి ఉన్న డిజిటల్ పర్సనల్ లోన్ బుక్ విలువ రూ. 1.28 లక్షల కోట్లుగా ఉంది.

అరవై శాతం రుణాలు తీసుకున్నది 35ఏళ్ల లోపు వారే

మొత్తం మంజూరు చేసిన రుణాల్లో 60 శాతం 35 ఏళ్లలోపు వారే తీసుకున్నారు. 17 శాతం మహిళలు డిజిటల్ పర్సనల్ లోన్లు తీసుకోగా, 53 శాతం రుణాలు టైర్ 3 నగరాల్లోని వారే తీసుకున్నారు. ఇది గణనీయమైన ఆర్థిక సౌకర్యం, క్రెడిట్ విస్తరణను సూచిస్తుంది. స్మార్ట్‌ ఫోన్ వినియోగం పెరగడం, యూపీఐ వాడకం, ఆధార్, బ్యాంక్-స్టేట్‌మెంట్ డేటా లభ్యత డిజిటల్ వ్యక్తిగత రుణాలు పుంజుకునేందుకు దోహదపడ్డాయని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. కేవైసీ ప్రక్రియ వేగంగా జరుగుతుండటం, ఏఐ-ఆధారిత క్రెడిట్ స్కోరింగ్, దాదాపు-తక్షణ రుణ జారీ వంటివి ఎన్‌బీఎఫ్‌సీల ఆధిపత్యానికి కారణం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పండుగ సీజన్ డిమాండ్, సంవత్సరాంతపు ఖర్చుల వల్ల డిజిటల్ రుణాలు రికార్డు గరిష్టాలు సాధించవచ్చని నివేదిక పేర్కొంది.

Next Story