Tech Jobs: టెక్ రంగంలో ఈ ఏడాది 1.25 లక్షల ఉద్యోగాలు

by S Gopi |

ఈ ఏడాది ఉద్యోగాలు 12-15 శాతం పెరుగుతాయని అంచనా. దాదాపు 40 శాతం దిగ్గజ సంస్థలు ఇప్పటికే రోజువారీ పనిలో జనరేటివ్ ఏఐని ఉపయోగిస్తున్నాయి.

Tech Jobs: టెక్ రంగంలో ఈ ఏడాది 1.25 లక్షల ఉద్యోగాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది దేశీయ టెక్ రంగంలో భారీ నియామకాలు జరగనున్నాయి. 2026లో దాదాపు 1,25,000 కొత్త ఉద్యోగాలకు అవకాశాలు లభిస్తాయని, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), డేటా, సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాలను అత్యధిక గిరాకీ ఉంటుందని హెచ్ఆర్ సొల్యూషన్స్ సంస్థ అడెక్కొ ఇండియా నివేదిక తాజా ప్రకటనలో వెల్లడించింది. ఈ ఉద్యోగాలు ప్రయోగాత్మక దశ నుంచి ప్రధాన అవసరాల దశకు చేరాయని నివేదిక అభిప్రాయపడింది. ఫలితంగా ఈ ఉద్యోగాలకు గిరాకీ కూడా 51 శాతం పెరిగింది. దీనివల్ల ఈ ఏడాది ఉద్యోగాలు 12-15 శాతం పెరుగుతాయని అంచనా. దాదాపు 40 శాతం దిగ్గజ సంస్థలు ఇప్పటికే రోజువారీ పనిలో జనరేటివ్ ఏఐని ఉపయోగిస్తున్నాయి.

2023, 2024లలో నెమ్మదించిన తర్వాత 2025లో ఐటీ, ఐటీ సేవల రంగంలో నియామకాలు రికవరీ అవుతున్నాయని అడెక్కొ ఇండియా డైరెక్టర్ సంకేత్ చెంగప్ప అన్నారు. కంపెనీలు ఇప్పుడు మళ్ళీ నియామక ప్రక్రియను మొదలుపెట్టాయి. ముఖ్యంగా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా, ఆధునిక ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించిన నైపుణ్యాల కోసం ఉద్యోగులను తీసుకుంటున్నాయి. కొత్త గ్రాడ్యుయేట్ల నియామకం కూడా పెరిగింది. దీనర్థం ఐటీ రంగం నెమ్మదిగా కోలుకుంటోందని, 2026లో మరింత బలంగా పుంజుకోగలదని నివెదిక తెలిపింది.

మూడు రెట్లు పెరిగిన ఏఐ స్కిల్స్

భారతీయ ఐటీ కంపెనీల్లో అగ్రశ్రేణి కంపెనీలు ఫ్రెషర్లు, స్కిల్స్ ఉన్న నిపుణులను తీసుకోవడం కొనసాగిస్తామని చెప్పాయి. ఇటీవల డిసెంబర్ త్రైమాసికంలో ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ 5,043 మంది ఉద్యోగులను, విప్రో 6,529 మంది ఉద్యోగులను చేర్చుకుంది. కంపెనీలు ఉద్యోగులకు ఏఐ, భవిష్యత్తు సాంకేతికతలలో శిక్షణ కోసం భారీగా ఖర్చు చేస్తున్నాయి. 2,17,000 మంది ఉద్యోగులు ఇప్పుడు అధునాతన ఏఐ స్కిల్స్ కలిగి ఉన్నారని, ఇది గతేడాది కంటే మూడు రెట్లు ఎక్కువ అని టీసీఎస్ వెల్లడించింది. ఏఐ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తోందని, ఏఐపై ఎక్కువ దృష్టి పెట్టడానికి కంపెనీ తన జాబ్ స్ట్రక్చర్‌నే మారుస్తున్నట్టు పేర్కొంది.

రూ. 22 లక్షల వరకు ప్యాకేజీ

కంపెనీల బోర్డు స్థాయిలో కూడా సైబర్ భద్రత చాలా ముఖ్యమైని కంపెనీలు భావిస్తున్నాయి. అనేక ఐటీయేతర కంపెనీలు సైతం ఆటోమేషన్‌ను ఉపయోగిస్తున్నాయి. టెక్ నిపుణులను నియమించుకుంటున్నాయి. 2025లో అందుబాటులో ఉన్న ఉద్యోగులు, అవసరమైన స్కిల్స్ మధ్య అంతరం 44 శాతానికి పెరిగింది. ఇది అధిక జీతాలకు దారితీసింది. దీనివల్ల ఐటీ కంపెనీలు ఏఐ స్కిల్స్ ఉన్న ఫ్రెషర్లకు అధిక జీతాలను ఆఫర్ చేస్తున్నాయి. హెచ్‌సీఎల్ టెక్ సంవత్సరానికి రూ. 22 లక్షల వరకు ప్యాకేజీ అందిస్తోంది. ఇన్ఫోసిస్ రూ. 21 లక్షల వరకు ప్యాకేజీలను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దీంతో ఏఐ, అధునాతన సాంకేతిక నైపుణ్యాలు ఈ ఏడాది ఐటీ రంగంలో భారీ ఉద్యోగాలతో పాటు, అధిక జీతాలను, డిమాండ్‌ను నడిపిస్తాయని నివేదిక వెల్లడించింది.

Next Story