TCS: ఉద్యోగులకు సగటున 6-8 శాతం జీతాల పెంపు ప్రకటించిన టీసీఎస్

by S Gopi |

అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఏ+ కేటగిరీ ఉద్యోగులు 10 శాతానికి పైగా హైక్‌ను అందుకున్నారు.

TCS: ఉద్యోగులకు సగటున 6-8 శాతం జీతాల పెంపు ప్రకటించిన టీసీఎస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ ఈ ఏడాది ఉద్యోగుల వార్షిక జీతాల పెంపును ప్రకటించింది. కంపెనీ వర్గాల సమాచారం ప్రకారం, దేశంలోని ఉద్యోగులకు కంపెనీ సగటున 6-8 శాతం వరకు వేతన పెంపు అమలు చేసింది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఏ+ కేటగిరీ ఉద్యోగులు 10 శాతానికి పైగా హైక్‌ను అందుకున్నారు. గతేడాది ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల కారణంగా సెప్టెంబర్‌కు వాయిదా పడిన ఇంక్రిమెంట్ సైకిల్‌ని, టీసీఎస్ ఈసారి మళ్లీ సాధారణ స్థితికి తీసుకొచ్చింది. టీసీఎస్‌లో ఉద్యోగులను ఏ+, ఏ, బీ, సీ వంటి పనితీరు బ్యాండ్‌లుగా వర్గీకరిస్తారు. ఇందులో అగ్రశ్రేణి ఉద్యోగులకు అత్యధిక పెంపు లభించగా, తక్కువ రేటింగ్ పొందిన ఉద్యోగులకు కూడా 2-3 శాతం వరకు పెంపు ఇచ్చినట్లు సమాచారం. విదేశీ ఉద్యోగులకు 2-4 శాతం మధ్య జీతాలను పెంచారు. తాజా వార్షిక నివేదికలో కూడా టాప్ పెర్ఫార్మర్లకు రెండంకెల పెంపును కంపెనీ వెల్లడించింది. జీతాల పెంపుతో పాటు, దేశంలోని ఉద్యోగుల వేతనాన్ని కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించినట్లు టీసీఎస్ తెలిపింది. కాగా, ప్రస్తుతం టీసీఎస్‌లో ప్రపంచవ్యాప్తంగా 5.84 లక్షలకుపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Next Story