1,600 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన నైకీ

by Dishanational1 |
1,600 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన నైకీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా దిగ్గజ కంపెనీల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటికే టెక్ రంగంలో వేలాది మంది ఉద్యోగులు ఇంటిబాట పట్టగా, తాజాగా ప్రముఖ స్పోర్ట్స్‌వేర్‌ తయారీ సంస్థ నైకీ సైతం ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. మొత్తం ఉద్యోగుల్లో 2 శాతం అంటే సుమారు 1,600 కంటే ఎక్కువ మందిని తొలగించాలని నిర్ణయించినట్టు కంపెనీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కార్యాలయాల్లోని వారు ఈ లేఆఫ్స్‌కు ప్రభావితం అవనున్నారని ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం నైకీలో 83,500 మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. ఖర్చులను తగ్గించడంతో పాటు ఇటీవల ఆదాయం పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 'మరికొంత కాలం అమ్మకాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని భావిస్తున్నాం. వినియోగదారులు అవసరాలకు మాత్రమే ఖర్చు చేసే ధోరణిని అనుసరించడమే ఇందుకు కారణం. ఈ క్రమంలో కార్యకలాపాల నిర్వహణకు, వృద్ధి అవకాశాలను మెరుగుపరిచేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పట్లేదని' కంపెనీ వివరించింది. ఇదివరకు డిసెంబర్ నాటి ప్రకటనలో నైకీ కొత్త ఉత్పత్తుల సరఫరాను పరిమితం చేయడం, నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం, ఆటోమేషన్ పెంపు వంటి చర్యల ద్వారా వచ్చే 2-3 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల వరకు ఖర్చులను ఆదా చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా లేఆఫ్స్ ప్రక్రియను రెండు దశల్లో అమలు చేస్తామని, మొదటిదశ శుక్రవారం నుంచే మొదలవుతుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది ఆఖరులో రెండో దశ తొలగింపులు ఉంటాయని పేర్కొంది.


Next Story

Most Viewed