Silver: కొత్త గరిష్టాలకు వెండి ధరలు

by S Gopi |

ఆల్ ఇండియా సరాఫా ప్రకారం, వెండి ఈ ఏడాది ప్రారంభం నుంచి ఏకంగా 116.72 శాతం పెరిగింది

Silver: కొత్త గరిష్టాలకు వెండి ధరలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత కరెన్సీ రూపాయి బలహీనతకు తోడు అమెరికా ఫెడ్ రేట్ల కోత వంటి గ్లోబల్ పరిణామాల మధ్య వెండి ధరలు కొత్త రికార్డు గరిష్టాలకు చేరాయి. గురువారం ఒక్కరోజే వెండి కిలో రూ. 2,400 పెరిగి రూ. 2,09,000(అన్ని పన్నులు కలిపి) చేరుకున్నాయి. ఆల్ ఇండియా సరాఫా ప్రకారం, వెండి ఈ ఏడాది ప్రారంభం నుంచి ఏకంగా 116.72 శాతం పెరిగింది. గతేడాది డిసెంబర్ ఆఖరులో కిలో వెండి దాదాపు రూ. 90 వేల వద్ద ఉంది. రిటైల్ మార్కెట్లో కొనుగోళ్లతో పాటు పెట్టుబడులకు కూడా డిమాండ్ భారీగా పెరగడంతో వెండి కొత్త రికార్డులను చూస్తోంది. దీనికి మార్కెట్ సరఫరా బలహీనంగా ఉండటం, అంతర్జాతీయంగా కూడా వెండి ధరలు అధికంగా మారడం, భారత రూపాయి క్షీణత వంటి అంశాలు ధరలు మరింత పుంజుకునేందుకు దోహదపడ్డాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ విశ్లేషకులు దిలీప్ పర్మార్ అన్నారు. ఈ ఏడాదికి సంబంధించి ప్రధానంగా ప్రపంచ సరఫరా, చైనా నుంచి పెరిగిన గిరాకీ, పారిశ్రామిక వినియోగం వంటి అంశాలు ప్రభావితం చేశాయని ఆయన తెలిపారు. మరోవైపు బంగారం ధరలు కూడా పెరుగుతున్నాయి. గురువారం బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం రూ. 4,400 పెరిగి రూ. 1,30,290 వద్దకు చేరింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి రూ. 4 వేలు పెరిగి రూ. 1,19,350కి చేరింది.

Next Story