Stock Market: భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు

by S Gopi |

అమ్మకాల ఒత్తిడి కారణంగా మంగళవారం స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 1 శాతానికి పైగా పడిపోయాయి.

Stock Market: భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీ మార్కెట్లు దేశీయ, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారీ పతనాన్ని చూశాయి. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మార్కెట్‌లో కీలక రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం లాంటి షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కారణంగా మంగళవారం స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 1 శాతానికి పైగా పడిపోయాయి. అంతేకాకుండా, రూపాయి మారకంలో కొనసాగుతున్న బలహీనత, విదేశీ నిధుల ఉపసంహరణ పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ముఖ్యంగా ఐటీ షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2 శాతానికి పైగా పడిపోయింది. ఇటీవల కేంద్రం తెచ్చిన కొత్త లేబర్ కోడ్స్ వల్ల ఐటీ కంపెనీలు త్రైమాసిక ఫలితాలు తగ్గాయి. అందుకే ఐటీ స్టాక్స్‌పై ఒత్తిడి కనిపించింది. ట్రేడింగ్ సమయంలో కీలక సూచీ సెన్సెక్స్ ఓ దశలో 1,200 పాయింట్ల కంటే ఎక్కువ నష్టపోయినప్పటికీ, ఆ తర్వాత కోలుకున్నాయి. నిఫ్టీ సైతం 25,170 పాయింట్లకు చేరిన అనంతరం రికవరీ అయ్యాయి. ఫలితంగా మదుపర్ల సంపద ఒక్కరోజే రూ. 9.8 లక్షల కోట్లు కోల్పోయారు. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 455.4 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,065.71 పాయింట్లు కుదేలై 82,180 వద్ద, నిఫ్టీ 353 పాయింట్లు క్షీణించి 25,232 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్ మాత్రమే లాభాలను దక్కించుకోగా, మిగిలిన అన్ని స్టాక్స్ దెబ్బతిన్నాయి. ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండిగో షేర్లు 3 శాతానికి పైగా పడిపోయాయి.

రూపాయి బలహీనత

మరోవైపు, విలువైన లోహాల దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరగడం, విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినడంతో మంగళవారం భారత కరెన్సీ రూపాయి విలువ 7 పైసలు క్షీణించి రూ. 90.97 వద్దకు చేరుకుంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, రిస్క్ తీసుకోవాలనే ధోరణిని తగ్గించాయని, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీలపై ఒత్తిడిని కొనసాగుతోందని ఫారెక్స్ నిపుణులు తెలిపారు.

Next Story