స్వల్ప లాభాలతో సరిపెట్టిన స్టాక్ మార్కెట్లు!

by Disha Web Desk 17 |
స్వల్ప లాభాలతో సరిపెట్టిన స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప లాభాలతో సరిపెట్టాయి. అంతకుముందు సెషన్‌లో మెరుగైన లాభాలను చూసిన సూచీలు అదే ధోరణిలో మంగళవారం సానుకూలంగా మొదలైనప్పటికీ అమ్మకాల ఒత్తిడి కారణంగా బలహీనపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా బడ్జెట్ ముందు మదుపర్ల ధోరణి, డాలరుతో రూపాయి మారకం విలువ బలహీనంగా ఉండటం, బ్యాంకింగ్ వంటి కీలక రంగాలతో పాటు దిగ్గజ రిలయన్స్ త్రైమాసిక ఫలితాల్లో నిరాశపరచడం వంటి పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీనికి తోడు గరిష్ఠాల వద్ద పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు ఆసక్తి చూపించడం కలిసి రాకపోవడం వల్ల మిడ్-సెషన్ తర్వాత స్టాక్ మార్కెట్లు నెమ్మదించాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 37.08 పాయింట్లు లాభపడి 60,978 వద్ద, నిఫ్టీ 0.25 పాయింట్ల అత్యల్ప లాభంతో 18,118 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో, ఐటీ, మీడియా రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, మారుతీ సుజుకి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్ పెయింట్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్, కోటక్ బ్యాంక్, ఎల్అండ్‌టీ, ఎస్‌బీఐ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 81,61 వద్ద ఉంది.


Next Story

Most Viewed