Stock Market: ఇన్వెస్టర్లకు రూ. 12 లక్షల కోట్ల నష్టం

by S Gopi |

రష్యా చమురును కొనే దేశాలపై అమెరికా వాణిజ్య ఆంక్షలు పెరిగే అవకాశం ఉందనే సంకేతాలతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది.

Stock Market: ఇన్వెస్టర్లకు రూ. 12 లక్షల కోట్ల నష్టం
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. అంతకుముందు సెషన్‌లో భారీ పతనాన్ని చూసిన సూచీలు, శుక్రవారం మరోసారి కుదేలయ్యాయి. రష్యా చమురును కొనుగోలు చేసుకునే దేశాలపై అమెరికా వాణిజ్య ఆంక్షలు పెరిగే అవకాశం ఉందనే సంకేతాలతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింది. అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యా చమురు కొనుగోలు కొనసాగించిన కారణంగా భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై సుంకాలను తీవ్రంగా పెంచే బిల్లును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదించారని కథనాలు వెలువడటం నష్టాలకు ఆజ్యం పోసింది. దీనికి తోడు అమెరికా జాబ్స్ డేటా, ఫెడ్ నిర్ణయాల నేపథ్యంలో గ్లోబల్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడం, ముడి చమురు ధరలు పెరుగుతుండటం, దేశీయ ఈక్విటీల నుంచి ఎఫ్ఐఐలు పెద్ద ఎత్తున నిధులను ఉపసంహరించుకోవడం, కీలక ఐటీ, ఫైనాన్స్, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్స్ రంగాల్లో అమ్మకాలు, వారాంతం లాభాల స్వీకరణ, రూపాయి బలహీనత వంటి అంశాలు అధిక నష్టాలకు కారణమయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 604.72 పాయింట్లు పడిపోయి 83,576 వద్ద, నిఫ్టీ 193.55 పాయింట్లు క్షీణించి 25,683 వద్ద ముగిశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ సాయంత్రం సమయానికి రూ. 90.14 వద్ద ఉంది.

5 రోజుల్లో రూ. 12 లక్షల కోట్ల సంపద ఆవిరి

ఇక, వరుస నష్టాల కారణంగా మదుపర్లు ఐదు సెషన్లలో ఏకంగా రూ. 12 లక్షల కోట్ల నష్టాలను చూశారని విశ్లేషకులు పేర్కొన్నారు. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ మునుపటి సెషన్‌లో రూ. 472.25 లక్షల కోట్లు ఉండగా, శుక్రవారం ఒక్కరోజే రూ. 3.45 లక్షల కోట్లు తగ్గి రూ. 468.80 లక్షల కోట్లకు చేరుకుంది. ఐదు ట్రేడింగ్ సెషన్లలో, మొత్తం పెట్టుబడిదారుల సంపద దాదాపు రూ. 12.44 లక్షల కోట్లు క్షీణించింది.

Next Story