SBI: తక్కువ వడ్డీకే మహిళా పారిశ్రామికవేత్తలకు ఎస్‌బీఐ రుణాలు

by S Gopi |   (  Updated:2025-03-07 17:51:08  IST  )

ప్రధానంగా మహిళా పారిశ్రామికవేత్తల కోసమే తక్కువ వడ్డీతో కూడిన రుణాలను ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

SBI: తక్కువ వడ్డీకే మహిళా పారిశ్రామికవేత్తలకు ఎస్‌బీఐ రుణాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రధానంగా మహిళా పారిశ్రామికవేత్తల కోసమే తక్కువ వడ్డీతో కూడిన రుణాలను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. 'అస్మిత' పేరుతో తీసుకొచ్చిన ఈ సౌకర్యం ద్వారా మహిళల వ్యాపార వృద్ధికి మద్దతుగా అదనపు వడ్డీ ప్రయోజనాలను బ్యాంకు అందించనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఈ రుణాల ప్రక్రియను టెక్నాలజీ ద్వారా సులభతరం చేసే లక్ష్యంతో అందించనున్నారు. ఈ రుణాల కోసం దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంలో ఉంటుంది. జీఎస్‌టీఐఎన్, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, సీటీసీ డేటాబేస్ ఉపయోగించి రుణాలు తీసుకునే మహిళల డేటా పరిశీలించనున్నారు. తద్వారా భౌతిక పత్రాల అవసరాన్ని తొలగిస్తూ, మహిళల వ్యాపార అవసరాల ఆధారంగా రుణాల పరిమితులను అంచనా వేయనున్నారు. అంతేకాకుండా, మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తించి వారికి వ్యాపార నిర్వహణ, శిక్షణను బ్యాంకు అందిస్తుంది. బ్యాంకు నిర్ణయంతో రాబోయే ఐదేళ్లలో మహిళా సాధికారతకు సమగ్రమైన మద్దతు ఇవ్వనున్నట్టు ఎస్‌బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి అధికారిక ప్రకటనలో తెలిపారు. ఇదే సమ్యంలో మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన, రూపే ఆధారిత ‘నారీ శక్తి’ ప్లాటినం డెబిట్ కార్డ్‌ను కూడా ప్రారంభించింది. ఇది 100 శాతం రీసైకిల్ ప్లాస్టిక్‌తో తయారు చేసిన మొదటి ఎస్‌బీఐ డెబిట్ కార్డ్. దీని ద్వారా మహిళలు ఎంటర్‌టైన్‌మెంట్, షాపింగ్, ప్రయాణం, జీవనశైలి, బీమా లావాదేవీల్లో ప్రయోజనాలను అందిస్తుంది.

Next Story