SBI: తగ్గనున్న ఎస్‌బీఐ బ్యాంకు ఈఎంఐ భారం

by S Gopi |

సవరించిన రేట్లు ఆగష్టు 15 నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంకు వెల్లడించింది.

SBI: తగ్గనున్న ఎస్‌బీఐ బ్యాంకు ఈఎంఐ భారం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ఎంపిక చేసిన కాలపరిమితులపై తాజాగా ఎస్‌బీఐ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్) 5 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సవరించిన రేట్లు ఆగష్టు 15 నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంకు వెల్లడించింది. కొత్త రేట్ల ప్రకారం, ఎంసీఎల్ఆర్ రేట్లు 7.95-8.90 శాతం నుంచి 7.90 శాతం నుంచి 8.85 శాతానికి చేరాయి. సాధారణంగా వినియోగదారులు తీసుకునే గృహ, వాహన, వ్యక్తిగత రుణాలకు సంబంధించి ఎంసీఎల్ఆర్ అతి తక్కువ వడ్డీ రేటును సూచిస్తుంది. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ వడ్డీ రేటుకు రుణాలు ఇవ్వవు. కాబట్టి తాజాగా ఎస్‌బీఐ ఎంసీఎల్ఆర్‌ను తగ్గించడం వల్ల కస్టమర్లు తీసుకునే రిటైల్ రుణాలపై వడ్డీ తగ్గనుంది. తద్వారా ఈఎంఐ భారం కూడా దిగిరానుంది. బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఓవర్‌నైట్, నెల రోజుల ఎంసీఎల్ఆర్ 7.95 శాతం నుంచి 7.9 శాతానికి, 3 నెలల ఎంసీఎల్ఆర్ 8.35 శాతం నుంచి 8.30 శాతానికి 6 నెలలకు 8.7 శాతం నుంచి 8.65 శాతానికి దిగొచ్చింది. రిటైల్ రుణాలపై ప్రభావం చూపే ఏడాది కాలవ్యవధి ఎంసీఎల్ఆర్ 8.8 శాతం నుంచి 8.75 శాతానికి దిగొచ్చింది. అలాగే, రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 8.85 శాతం నుంచి 8.80 శాతానికి, మూడేళ్లకు 8.9 శాతం నుంచి 8.85 శాతానికి బ్యాంకు తగ్గించింది.

Next Story