Economic Survey: 2017-18 స్థాయిల కంటే దిగువకు వేతనజీవులు, స్వయం ఉపాధి పొందేవారి జీతాలు

by S Gopi |

స్వయం ఉపాధి పొందే పురుషుల నెలవారీ వేతనాలు 2017-18 (రూ. 9,454) స్థాయితో పోలిస్తే 2023-24లో 9.1 శాతం తక్కువగా ఉన్నాయి.

Economic Survey: 2017-18 స్థాయిల కంటే దిగువకు వేతనజీవులు, స్వయం ఉపాధి పొందేవారి జీతాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: 2023-24లో స్వయం ఉపాధి పొందుతున్నవారితో పాటు వేతనజీవుల సగటు నెలవారీ జీతాలు 2017-18 స్థాయిల కంటే దిగువకు పడిపోయాయని శుక్రవారం విడుదలైన ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరం సర్వేలోని డేటా ప్రకారం.. స్వయం ఉపాధి పొందే పురుషుల నిజమైన నెలవారీ వేతనాలు 2017-18 (రూ. 9,454) స్థాయితో పోలిస్తే 2023-24లో 9.1 శాతం తక్కువగా (రూ. 8,591) ఉన్నాయి. అలాగే 2023-24లో స్వయం ఉపాధి పొందే మహిళల నెలవారీ వేతనం కూడా 32 శాతం తగ్గి రూ.2,950కి పడిపోయింది. మరోవైపు, పురుష వేతనజీవుల నెలవారీ వేతనం 2017-18లో రూ. 12,665 నుంచి 2023-24లో 6.4 శాతం (రూ. 11,858) తక్కువగా ఉంది. మహిళా వేతనజీవులకు 2017-18లో రూ. 10,116 జీతం లభిస్తుండగా 2023-24లో ఇది 12.5 శాతానికి (రూ. 8,855) తగ్గింది. అయితే, మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 2017-18లో 23.3 శాతం నుంచి 2023-24లో 41.7 శాతానికి పెరిగింది. అయితే, అసంఘటిత రంగాల్లోని కార్మికుల వేతనాలు 2017-18 స్థాయిలతో పోలిస్తే 2023-24లో అధిక స్థాయిలో ఉన్నాయి. 2017-18లో వారు సగటున రోజుకు రూ. 203 తీసుకోగా, 2023-24లో 19.2 శాతం (రూ. 242) పెరిగింది. మహిళలకు కూడా రూ.128 నుంచి రూ.159కి (24 శాతం) పెరిగింది. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా స్వయం ఉపాధి, వేతనజీవులు వేతనాల్లో చాలా నష్టపోయారని చెప్పారు. మొదట నోట్ల రద్దు, కోవిడ్ లాక్‌డౌన్ వంటి వరుస పరిణామాలు దెబ్బతీయగా, ప్రస్తుతం సరఫరా పరిమితుల కారణంగా ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది, ఫలితంగా ఆదాయాలు క్షీణించాయన్నారు.

Next Story