Rupee: మూడు వారాల్లోనే అత్యంత దారుణంగా పతనమైన రూపాయి

by S Gopi |

అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి విలువ దాదాపు 50 పైసలు పడిపోయి రూ. 87.21 వద్ద ఉంది.

Rupee: మూడు వారాల్లోనే అత్యంత దారుణంగా పతనమైన రూపాయి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ, అంతర్జాతీయ పరిణామాల మధ్య భారత కరెన్సీ రూపాయి రికార్డు స్థాయిలో పతనమైంది. ప్రధానంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ)కి సంబంధించి 5-6 బిలియన్ డాలర్ల విలువైన ఆఫ్‌షోర్ ఫార్వార్డ్ కాంట్రాక్టులు గడువు ముగియనున్న నేపథ్యంలో మంగళవారం గడిచిన మూడు వారాల్లోనే అత్యంత దారుణంగా క్షీణించింది. దీంతో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి విలువ దాదాపు 50 పైసలు పడిపోయి రూ. 87.21 వద్ద ఉంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూపాయి విలువ 4.31 శాతం క్షీణించింది. డెరివేటివ్‌లకు సంబంధించి తగ్గిన డిమాండ్‌తో రూపాయి కరెన్సీకి మద్దతిచ్చేందుకు ఆర్‌బీఐ జోక్యం చేసుకోవడంతో పాటు ఆసియా వ్యాప్తంగా అన్ని దేశాల కరెన్సీలు బలహీనంగా ఉండటం, అమెరికా టారిఫ్‌లపై ఆందోళనలు కొనసాగడం వంటి అంశాలు ప్రభావితం చేశాయి. మరోవైపు, స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. మంగళవారం ట్రేడింగ్‌లో సూచీలు గత ఐదు సెషన్ల నుంచి అమ్మకాల తర్వాత మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాల్ కారణంగా సెన్సెక్స్ లాభాల్లో ముగియగా, నిఫ్టీ నష్టపోయింది. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 147.71 పాయింట్లు లాభపడి 74,602 వద్ద, నిఫ్టీ 5.80 పాయింట్లు నష్టపోయి 22,547 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, జొమాటో, నెస్లె ఇండియా, మారుతీ సుజుకి షేర్లు లాభాలను సాధించాయి.

Next Story