RBI: ఇకపై బంగారు రుణాలు తీసుకోవడం కష్టమే

by S Gopi |

రుణాలు తీసుకునే కారణాలకు సంబంధించి స్పష్టమైన వివరాలను కస్టమర్ల నుంచి సేకరించాలని ఆర్‌బీఐ సూచించింది.

RBI: ఇకపై బంగారు రుణాలు తీసుకోవడం కష్టమే
X

దిశ, బిజినెస్ బ్యూరో: అత్యంత వేగంగా పెరుగుతున్న బంగారు రుణాల విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. బంగారు రుణాలు ఇచ్చే క్రమంలో కఠినమైన ప్రక్రియను పాటించాలని, రుణాలు తీసుకునే కారణాలకు సంబంధించి స్పష్టమైన వివరాలను కస్టమర్ల నుంచి సేకరించాలని ఆర్‌బీఐ సూచించింది. గత కొన్ని వారాలుగా గోల్డ్ లోన్లు అత్యంత పెరుగుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణాలు తీసుకునే కస్టమర్ల క్రెడిట్ నేపథ్యం గురించి సరైన తనిఖీ చేయాలని, తనఖా పెట్టిన బంగారానికి సంబంధించి స్పష్టమైన సమాచారం తీసుకోవాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ప్రామాణిక నిబంధనలను బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు పాటించాలని, పరిమితి దాటి గోల్డ్ లోన్లు ఇవ్వకుండా చూసుకోవాలని ఆర్‌బీఐ భావిస్తోంది. ప్రధానంగా అనైతిక వ్యాపార పద్దతులు, ఆర్థిక స్థిరత్వం దెబ్బతినకుండా ఉండేందుకు ఈ చర్యలు అవసరమని సూచించింది. డేటా ప్రకారం, గతేడాది సెప్టెంబర్ నుంచి బ్యాంకుల బంగారు రుణాలు 50 శాతం మేర పెరిగాయి. అన్‌సెక్యూర్డ్ రుణాలపై ఆర్‌బీఐ కఠిన నిబంధనలు విధించడం కూడా బంగారం రుణాలు పెరిగేందుకు కారణమయ్యాయి. దీనికి తోడు పసిడి ధరలు రికార్డు గరిష్టాలకు చేరడం కూడా ఈ వృద్ధికి కారణమయ్యాయి. ఈ క్రమంలోనే బ్యాంకుల గోల్డ్ లోన్ విభాగంలో పలు అక్రమ పద్ధతులను, బ్యాంకింగేత సంస్థల పోర్ట్‌ఫోలియోలోనూ అవకతవకలను ఆర్‌బీఐ గుర్తించింది. కొన్ని బ్యాంకులు డిఫాల్ట్ అయిన కస్టమర్ల బంగారాన్ని వేలం వేస్తున్నట్టు ఆర్‌బీఐ సమీక్షలో తేలింది. గత 12-16 నెలల కాలంలో నిర్వహించిన ఆడిట్ ద్వారా నియంత్రణ లోపాలు కూడా ఉండటంతో ఆర్‌బీఐ చర్యలను ప్రారంభించింది.

Next Story