RBI: బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలలో అంతర్గత అంబుడ్స్‌మన్‌కు ఆర్‌బీఐ మార్గదర్శకాల జారీ

by S Gopi |

బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో అంతర్గత అంబుడ్స్‌మన్ (ఐఓ) నియామకంపై ఈ కొత్త నిబంధనలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి.

RBI: బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలలో అంతర్గత అంబుడ్స్‌మన్‌కు ఆర్‌బీఐ మార్గదర్శకాల జారీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: కస్టమర్ల ఫిర్యాదులను పరిష్కరించే విధానాన్ని మెరుగుపరచడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కస్టమర్ల సమస్యలు సరిగ్గా, త్వరగా పరిష్కరించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో అంతర్గత అంబుడ్స్‌మన్ (ఐఓ) నియామకంపై ఈ కొత్త నిబంధనలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి. వాణిజ్య బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ప్రీపెయిడ్ చెల్లింపుల కంపెనీలు, క్రెడిట్ సమాచార కంపెనీలు వంటి వివిధ సంస్థలకు ఆర్‌బీఐ విడివిడి మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం, ప్రతి బ్యాంకు, ఆర్థిక సంస్థ కనీసం ఒక అంతర్గత అంబుడ్స్‌మన్‌ను నియమించాలి. ఆ అంతర్గత అంబుడ్స్‌మన్ సీనియర్ అధికారి అయి ఉండాలి. ప్రస్తుతం పనిచేస్తున్న లేదా పదవీ విరమణ చేసిన వ్యక్తి అయి ఉండవచ్చు. బ్యాంకింగ్, ఫైనాన్స్, చెల్లింపులు, నియంత్రణ, కస్టమర్ భద్రత వంటి విభాగాల్లో కనీసం ఏడు సంవత్సరాల అనుభవం ఉండాలి.

అయితే, ఈ అంతర్గత అంబుడ్స్‌మన్ కస్టమర్ల నుంచి నేరుగా ఫిర్యాదులను తీసుకోరు. బదులుగా, బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీ అప్పటికే తనిఖీ చేసిన లేదా పాక్షికంగా పరిష్కరించిన లేదా పూర్తిగా తిరస్కరించిన ఫిర్యాదులను సమీక్షిస్తారు. ఈ అంతర్గత అంబుడ్స్‌మన్ ద్వారా కస్టమర్ ఫిర్యాదులకు ఉన్నత స్థాయిలో న్యాయమైన సమీక్ష లభిస్తుందని ఆర్‌బీఐ భావిస్తోంది. కస్టమర్ సర్వీస్, ఫిర్యాదుల నిర్వహణను తమ సూపర్‌విజన్ డిపార్ట్‌మెంట్ నిశితంగా పర్యవేక్షిస్తుందని ఆర్‌బీఐ తెలిపింది. అంటే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఈ మార్గదర్శకాలను పాటిస్తున్నాయో లేదో, కస్టమర్ ఫిర్యాదులను సకాలంలో, సరైన తీరులో పరిష్కరిస్తున్నాయో లేదో తనిఖీ చేస్తామని పేర్కొంది.

Next Story