- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RBI: క్వాంటం యుగానికి సిద్ధమవుతున్న భారత్
ప్రపంచ దేశాలు ఈ రంగంలో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి, భారత ఆర్థిక వ్యవస్థకు అనువైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించనుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: భవిష్యత్తులో బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక లావాదేవీల భద్రతపై క్వాంటం కంప్యూటింగ్ ప్రభావం చూపే అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో, భారత ఆర్థిక వ్యవస్థను ‘క్వాంటం-సెక్యూర్’ చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక అడుగు వేసింది. ఇందుకోసం ఎనిమిది మంది నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ‘క్వాంటం సెక్యూర్ అండ్ అడాప్టివ్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్’ (క్యూ-సేఫ్) పేరుతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ, క్వాంటం టెక్నాలజీ వల్ల ఆర్థిక రంగానికి కలిగే అవకాశాలు, ముప్పు, సవాళ్లను సమగ్రంగా అధ్యయనం చేయనుంది. అంతేకాకుండా, ప్రపంచ దేశాలు ఈ రంగంలో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి, భారత ఆర్థిక వ్యవస్థకు అనువైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించనుంది. ముఖ్యంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రస్తుతం ఉపయోగిస్తున్న క్రిప్టోగ్రఫీ వ్యవస్థలు క్వాంటం టెక్నాలజీకి ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయో అంచనా వేయడంతో పాటు, అత్యంత హానీకి గురయ్యే కీలక వ్యవస్థలను గుర్తించడం కూడా కమిటీ బాధ్యతల్లో భాగం. ఈ కమిటీ తన తొలి సమావేశం నుంచి ఆరు నెలల్లో నివేదికను ఆర్‌బీఐకి సమర్పించనుంది.
ఐఐటీ మద్రాస్‌కు చెందిన ప్రొఫెసర్ అనిల్ ప్రభాకర్ ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరించనుండగా, ఆర్‌బీఐ ఫిన్‌టెక్ విభాగం సెక్రటేరియల్ సహాయాన్ని అందిస్తుంది. క్వాంటం టెక్నాలజీ ద్వారా రిస్క్ అసెస్‌మెంట్, పోర్ట్‌ఫోలియో ఆప్టిమైజేషన్, ఆర్థిక అంచనాలు వంటి సంక్లిష్ట అంశాలను మరింత సమర్థంగా నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఉపయోగిస్తున్న డిజిటల్ భద్రతా వ్యవస్థలకు ఇది సవాలుగా మారే ప్రమాదం కూడా ఉందని ఆర్‌బీఐ భావిస్తోంది.






