లక్ష్మీ కో-ఆపరేటివ్ బ్యాంకు లైసెన్స్ రద్దు చేసిన ఆర్‌బీఐ!

by Disha Web Desk 17 |
లక్ష్మీ కో-ఆపరేటివ్ బ్యాంకు లైసెన్స్ రద్దు చేసిన ఆర్‌బీఐ!
X

ముంబై: మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన లక్ష్మీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్సును రద్దు చేస్తున్నట్టు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గురువారం వెల్లడించింది. తాజా ప్రకటనలో బ్యాంకు వ్యాపారాన్ని కొనసాగించే వ్యవహారాలను సెప్టెంబర్ 22 నుంచి నిలిపివేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. బ్యాంకు వద్ద తగిన మూలధనం లేకపోవడం, ఆదాయ అవకాశాలు లేకపోవడం వంటి నిబంధనలకు విరుద్ధమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్‌బీఐ పేర్కొంది.

అంతేకాకుండా బ్యాంకింగ్ చట్టం-1949 కి అనుగుణంగా బ్యాంకు పనిచేయకపోవడంతో లైసెన్స్ రద్దు చేసినట్లు వివరించింది. బ్యాంకు మూసివేయడంతో పాటు లిక్విడేటర్‌ను నియమించాలని మహారాష్ట్ర సహకార సంఘాల కమిషనర్, రిజిస్ట్రార్‌ను ఆర్బీఐ సూచించింది. ప్రస్తుతానికి డిపాజిటర్ల నగదును పూర్తిస్థాయిలో తిరిగి చెల్లించే స్థితిలో బ్యాంకు లేదని, ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకు కొనసాగితే డిపాజిటర్ల ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

అయితే, ఖాతాదారుల సొమ్ముకు సంబంధించి ఆర్‌బీఐ వివరణ ఇచ్చింది. బ్యాంకులో డిపాజిట్ చేసిన వారందరూ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ నుంచి బీమా పరిహారాన్ని పొందడానికి వీలుంది. దీని ప్రకారం, గరిష్ఠంగా రూ. 5 లక్షల వరకు డిపాజిటర్లు పొందవచ్చని తెలిపింది.

డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ చట్టం-1961 ప్రకారం, బ్యాంకుల్లో ఉన్న ఖాతాదారుల సొమ్ముకు రూ. 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. అనుకోని కారణాలతో బ్యాంకు దివాలా తీస్తే ఖాతాదారులకు ఈ మొత్తం పొందవచ్చు.


Next Story

Most Viewed