PhonePe health insurance :నెలవారీ చెల్లింపులతో ఫోన్‌పే ఆరోగ్య బీమా!

by Disha Web Desk 17 |
PhonePe health insurance :నెలవారీ చెల్లింపులతో ఫోన్‌పే ఆరోగ్య బీమా!
X

న్యూఢిల్లీ: ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే అనుబంధ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ మంగళవారం ఆరోగ్య బీమా ప్లాన్‌లను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఇది భారత్‌లో మొదటిసారిగా నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌లను అందిస్తుంది. దీని ద్వారా వినియోగదారులకు ధరల భారాన్ని తగ్గించవచ్చని ఫోన్‌పే అభిప్రాయపడింది. ఈ నిర్ణయం ద్వారా కస్టమర్లకు ఎంపిక చేసిన ఆరోగ్య బీమా పాలసీని నెలవారీగా చెల్లించే అవకాశం లభిస్తుంది.

ఒకేసారి ఎక్కువ మొత్తం చెల్లించలేని వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ వివరించింది. ఈ సదుపాయం అందించేందుకు దేశంలోని బీమా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని, యూపీఐ ద్వారా వినియోగదారులు నెలనెలా చెల్లింపులు చేయవచ్చని ఫోన్‌పే ఫైనాన్షియల్ విభాగం అధ్యక్షుడు హేమంత్ అన్నారు.

నెలవారీగా వద్దనుకునే వారికి ఒకేసారి చెల్లించే సౌకర్యం కూడా ఉంటుందని ఆయన తెలిపారు. ఫోన్‌పే ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫామ్‌పై రూ. కోటి వరకు ఆరోగ్య బీమా కవరేజీ పొందవచ్చు. ఎలాంటి పరిమితి లేకుండా ఆసుపత్రి గదిని ఎంచుకోవచ్చని కంపెనీ వివరించింది. ఆరోగ్య బీమాను వాడుకోని సమయానికి బేస్ కవర్ అమౌంట్‌పై ఏడు రెట్ల వరకు బోనస్ పొందవచ్చని వెల్లడించింది. కాగా, ఫోన్‌పే ఇప్పటివరకు 56 లక్షలకు పైగా పాలసీలను విక్రయించింది. దేశంలో 98 శాతం పిన్‌కోడ్‌లలో పాలసీలను అందిస్తోంది.


Next Story