Online Shopping: శరవేగంగా ఆన్‌లైన్ షాపింగ్

by S Gopi |   (  Updated:2025-07-28 14:57:58  IST  )

యూఎస్, చైనాలలో 85 శాతం కంటే ఎక్కువ మంది ఇంటర్నెట్ యూజర్లు ఈ-షాపింగ్ చేస్తారు.

Online Shopping: శరవేగంగా ఆన్‌లైన్ షాపింగ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఆన్‌లైన్ షాపింగ్ ధోరణి పెరుగుతోంది. గతంలో ఉన్నట్టు బయటకు వెళ్లి రిటైల్ స్టోర్లలో కొనేందుకు సమయం లేకపోవడం, ఆన్‌లైన్‌లో ఆఫర్ల కారణంగా ఆన్‌లైన్‌లో కొనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భవిష్యత్తులో భారత ఈ-కామర్స్ రంగం మరింత వేగంగా వృద్ధిని సాధించనుందని గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ మెకెన్సీ వెల్లడించింది. తాజాగా సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారత్‌లో 850 మిలియన్ల (85 కోట్లు) మంది ఇంటర్నెట్‌ వినియోగదారులున్నారు. ప్రస్తుతం వారిలో కేవలం 20-25 శాతం మాత్రమే ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేస్తున్నారు. దీనర్థం రానున్న రోజుల్లో ఆన్‌లైన్ షాపింగ్‌కు మరింత వృద్ధి సాధించగల సత్తా ఉంది. అమెరికా, చైనాలతో పోల్చుకుంటే మనదేశంలో ఇంటర్నెట్ వాడుతున్న వారికి, ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్న వారికి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంది. యూఎస్, చైనాలలో 85 శాతం కంటే ఎక్కువ మంది ఇంటర్నెట్ యూజర్లు ఈ-షాపింగ్ చేస్తారు. దీన్ని బట్టి మనదేశంలోనూ ఇంటర్నెట్ వాడుతున్న వారికి అనుగుణంగా ఆన్‌లైన్ షాపింగ్ పెరిగితే ఈ రంగంలో అపామన అవకాశాలు ఉన్నట్టే. గత కొన్నేళ్లలోనే దేశీయ ఈ-కామర్స్ కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతోందని నివేదిక అభిప్రాయపడింది.

క్విక్-కామర్స్ ఎఫెక్ట్

భారత్ ఆన్‌లైన్ షాపింగ్‌ను వేగంగా స్వీకరించే దేశంగా మాత్రమే కాకుండా, ఈ రంగంలో కొత్త ఇన్నోవేటర్‌గా కూడా అభివృద్ధి చెందుతోంది. చాలా తక్కువ సమయంలో వస్తువులను డెలివరీ చేసే క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల పెరుగుదల ఇందుకు దోహదపడనుంది. అయితే, 2023 నాటికి భారత మొత్తం రిటైల్ అమ్మకాలలో ఈ-కామర్స్ వాటా ఇప్పటికీ 7 నుంచి 9 శాతం మాత్రమే ఉంది. ఈ వాటా 2030 నాటికి రెట్టింపు కంటే ఎక్కువగా 15-17 శాతం మధ్య ఉంటుందని అంచనా. ఇది దేశంలో ఆన్‌లైన్ షాపింగ్ విస్తరణకు ఉన్న భారీ సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది.

ముఖ్యంగా కొత్త బిజినెస్ మోడల్స్ దేశంలో ఈ-కామర్స్ పరిశ్రమ రూపురేఖలను మారుస్తున్నాయి. క్విక్-కామర్స్, సోషల్ కామర్స్ కలిసి నేటి ఈ-కామర్స్ మార్కెట్లో 15 శాతానికి పైగా ఉన్నాయి. 2030 నాటికి వీటి వాటా 25 శాతానికి మించి ఉంటుందని అంచనా నివేదిక అంచనా కట్టింది. ఈ-కామర్స్ కంపెనీలు వినియోగదారులకు సేవలందించేందుకు కొత్త మార్గాలను కూడా అన్వేషిస్తున్నాయి. అవి దేశీయంగా సేవలకు ఇన్‌స్టంట్ బుకింగ్‌లు, వృత్తిపరమైన సహాయం, వైద్య సహాయం వంటి కొత్త విభాగాల్లోకి విస్తరిస్తున్నాయి.

చిన్న నగరాల్లో ఎక్కువ డిమాండ్

భారతీయ ఈ-కామర్స్‌లో తదుపరి వృద్ధికి రెండు ప్రధాన కారకాలు ఉన్నాయి. ఒకటి బీ2బీ (బిజినెస్-టు-బిజినెస్) కామర్స్, నిర్మాణ సామగ్రి వంటి కొత్త విభాగాలలోకి ప్రవేశించడం. మరొకటి టైర్-2, టైర్-3 నగరాల నుంచి పెరుగుతున్న డిమాండ్. ఈ నగరాలు మెట్రో, టైర్-వన్ నగరాల కంటే వేగంగా ఆదాయ పెరుగుదలను చూస్తున్నాయి. టైర్-2 నగరాల్లో నెలవారీ ఆదాయాలు 2023-2024 మధ్య 18 శాతం పెరిగాయి. ఇది పెద్ద సిటీల్లో కనిపించే వృద్ధి కంటే ఎక్కువని నివేదిక తెలిపింది. దేశంలో ఈ-కామర్స్ సాంప్రదాయ రిటైల్‌ రంగానికి మించి వృద్ధి సాధించనుందని నివేదిక అభిప్రాయపడింది. ఇది లాస్ట్ మైల్ డెలివరీ, లాజిస్టిక్స్ వంటి రంగాలతో సహా మొత్తం రిటైల్ వ్యవస్థను పునర్నిర్మిస్తుందని నివేదిక పేర్కొంది.

Next Story