Online Scam: పండుగ సీజన్ సేల్స్‌లో జాగ్రత్త.. పెరుగుతున్న ఏఐ, డీప్‌ఫేక్ మోసాలు

by S Gopi |

ఆన్‌లైన్ వినియోగదారులలో ముగ్గురిలో ఒకరు ఇలాంటి మోసాల బారిన పడుతున్నారని సైబర్ సెక్యూరిటీ కంపెనీ మెక్అఫీ తెలిపింది.

Online Scam: పండుగ సీజన్ సేల్స్‌లో జాగ్రత్త.. పెరుగుతున్న ఏఐ, డీప్‌ఫేక్ మోసాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ వేళ అన్ని ఈ-కామర్స్ కంపెనీ సేల్స్ నిర్వహిస్తున్నాయి. ఇందులో భారీ ఎత్తున ఆఫర్లను కూడా అందిస్తున్నాయి. దీన్ని అదునుగా తీసుకుని చాలామంది సైబర్ నేరగాళ్లు పండుగ సీజన్‌కు ఆన్‌లైన్‌లో కొనేవారిని సులభంగా మోసం చేస్తున్నారు. ఇందుకు ప్రధానంగా వారు ఏఐ, డీప్‌ఫేక్ లాంటి టెక్నాలజీ వాడుతున్నారు. దీపావళి పండుగ సీమీపిస్తున్న సమయంలో చాలామంది షాపింగ్ కోసం ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తున్నారు. దీంతో సైబర్ దాడులు కూడా పెరుగుతున్నాయి. దేశంలోని ఆన్‌లైన్ వినియోగదారులలో దాదాపు ముగ్గురిలో ఒకరు ఇలాంటి మోసాల బారిన పడుతున్నారని సైబర్ సెక్యూరిటీ కంపెనీ మెక్అఫీ తెలిపింది. మరో 37 శాతం మంది ఆర్థికపరమైన నష్టాలను ఎదుర్కొన్నట్టు చెప్పారని పేర్కొంది.

ఈసారి పండుగ సీజన్‌కు స్కామర్‌ల మోసాలు పెరిగాయి. సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ, మోసపూరిత ఘటనలు కూడా పెరుగుతున్నాయి. ఏఐ-ఆధారిత స్కామ్‌లు ఆన్‌లైన్ స్టోర్లను నిర్వహించేవారికి కొత్త సవాలుగా మారాయని మెక్‌అఫీ సీనియర్ ఇంజనీరింగ్ డైరెక్టర్ ప్రతిమ్ ముఖర్జీ అన్నారు. దీన్ని అధిగమించేందుకు తరచూ వెబ్‌సైట్‌లను తనిఖీ చేయడం, డివైజ్‌లను సెక్యూర్‌గా ఉంచుకోవడం, అప్రమత్తంగా ఉండటం ద్వారా, సైబర్ దాడుల నుంచి బయటపడగలుగుతున్నామని ఆయన అన్నారు.

కస్టమర్లు ఆన్‌లైన్‌లో ఎక్కువ కొనుగోళ్లు చేస్తున్న నేపథ్యంలో సైబర్ మోసగాళ్ళు డీప్‌ఫేక్ సెలబ్రిటీ ఎండార్స్‌మెంట్‌లు, ఫిషింగ్ మేసేజ్‌లు, స్కామ్ ఈ-మెయిల్‌లు, వన్-టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) సహా అధునాతన వ్యూహాలను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మొబైల్ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ పెరుగుతుండటం కూడా సైబర్ మోసాలకు కారణం. 77 శాతం మంది ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా కొనుగోళ్లు చేస్తున్నారు. ముఖ్యంగా 25-44 సంవత్సరాల వయస్సు గల యువ కస్టమర్లు మొత్తం ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లకు ప్రధాన కస్టమర్లుగా ఉన్నారు.

గతేడాది కంటే 72 శాతం మంది ఏఐ-ఆధారిత స్కామ్‌ల గురించి ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. దాదాపు 91 శాతం మందికి అనుమానాస్పద షాపింగ్ సంబంధిత మెసేజ్‌లు వచ్చాయి, వాటిలో నకిలీ ‘గిఫ్ట్ కార్డ్ విన్నర్’ పేరుతో (49 శాతం), ‘లిమిటెడ్-టైమ్ ఆఫర్లు’ (40 శాతం), ‘రీఫండ్ నోటిఫికేషన్లు’ (27 శాతం) ఉన్నాయి. సగటున, దేశంలోని ప్రజలు రోజుకు 12 స్కామ్ ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. సాధారణ మెసేజ్‌లు, ఫిషింగ్ ఈ-మెయిల్స్, మోసపూరిత సోషల్ మీడియా యాడ్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముఖ్యంగా డీప్‌ఫేక్ సెలబ్రిటీ ఎండార్స్‌మెంట్‌లు, నకిలీ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు ఎక్కువ ఆందోళన కలిగిస్తున్నాయి, ఇవి నిజమైనవా కాదా అని తేల్చడం క్లిష్టంగా మారిందని మెక్అఫీ నివేదిక పేర్కొంది.

Next Story