Ola Electric: ట్రేడ్ సర్టిఫికేట్‌లు లేకుండానే 95 శాతం ఓలా షోరూమ్‌ల నిర్వహణ

by S Gopi |

2022 నుంచి ఇప్పటివరకు కంపెనీ 4,000 ఫిజికల్ ఔట్‌లెట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది

Ola Electric: ట్రేడ్ సర్టిఫికేట్‌లు లేకుండానే 95 శాతం ఓలా షోరూమ్‌ల నిర్వహణ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్‌కు కష్టాలు వెన్నాడుతున్నాయి. ఇదివరకే వాహన అమ్మకాలు, సర్వీసుల్లో లోపాల కారణంగా పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు ఎదుర్కొన్న కంపెనీ తాజాగా నియంత్రణ ఉల్లంఘనల కారణంగా ఇబ్బందులు పడుతోంది. తొలినాళ్లలో డిజిటల్-ఓన్లీ సేల్స్ మోడల్‌తో వచ్చిన ఓలా ఎలక్ట్రిక్ ఆ తర్వాత పరిణామాల కారణంగా దేశవ్యాప్తంగా ఔట్‌లెట్‌లను విస్తరించడం ప్రారంభించింది. దీన్ని మరింత వేగవంతం చేస్తున్నట్టు కూడా ప్రకటించింది. 2022 నుంచి ఇప్పటివరకు కంపెనీ 4,000 ఫిజికల్ ఔట్‌లెట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, బ్లూమ్‌బర్గ్ నిర్వహిచిన పరిశోధనలో 3,400 షోరూమ్‌లలో 100 ఔట్‌లెట్‌లు మాత్రమే భారత మోటార్ వెహికల్ యాక్ట్ కింద ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉన్నాయి. అంటే మిగిలిన 95 శాతం కంటే ఎక్కువ ఔట్‌లెట్‌లకు టూ-వీలర్ వాహనాల డిస్‌ప్లే, సేల్స్, టెస్ట్ రైడ్‌లు అందించేందుకు కావాల్సిన సాధారణ ధృవపత్రాలు లేవని తెలుస్తోంది. దీనికి సంబంధించి కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో దేశవ్యాప్తంగా కంపెనీ షోరూమ్‌లపై రవాణా అధికారులు దాడులు నిర్వహించారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని కారణంగా కొన్ని షోరూమ్‌లను మూసివేయగా, వాహనాలను సీజ్ చేశారు. ఈ వ్యవహారంపై కంపెనీకి షోకాజ్ నోటీసులు సైతం అందించినట్టు సమాచారం. మోటారు వాహనాల చట్టం ప్రకారం, ద్విచక్ర వాహనాలతో కలిపి దేశంలోని ప్రతి ఆటో షోరూమ్‌లలో ట్రేడ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా కనిపించేలా ఆఫీసుల్లో ఉంచాలి.

Next Story