PSBs: పీఎస్‌యూ బ్యాంకుల్లో ఎఫ్‌డీఐ పరిమితిని పెంచే ప్రతిపాదన లేదు: ఆర్థిక శాఖ

by S Gopi |

ఎఫ్‌డీఐ పరిమితిని పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించిందా లేదా అనే దానిపై పంకజ్ చౌదరి అలాంటి ఆలోచన లేదని సమాధానం ఇచ్చారు

PSBs: పీఎస్‌యూ బ్యాంకుల్లో ఎఫ్‌డీఐ పరిమితిని పెంచే ప్రతిపాదన లేదు: ఆర్థిక శాఖ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని ప్రస్తుత 20 శాతం నుంచి 49 శాతానికి పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మంగళవారం తెలిపారు. ప్రస్తుతం ఎఫ్‌డీఐ వాటా పరిమితి పీఎస్‌బీల్లో 20 శాతం, ప్రైవేట్ రంగ బ్యాంకులలో 74 శాతంగా ఉంది. ప్రైవేట్ రంగ బ్యాంకుల విషయంలో ఎఫ్‌డీఐ ​​49 శాతం వరకు ఆటోమేటిక్ రూట్ ద్వారా, 49 శాతం దాటి 74 శాతం వరకు ప్రభుత్వ అనుమతితో వర్తిస్తుంది. పీఎస్‌బీలలో ఎఫ్‌డీఐ పరిమితిని 49 శాతానికి పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించిందా లేదా అనే దానిపై రాజ్యసభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా, పంకజ్ చౌదరి అలాంటి ఆలోచన లేదని సమాధానం ఇచ్చారు. మరో ప్రశ్నకు సమాధానమిస్తూ, 2020 నుంచి 12 ప్రభుత్వ రంగ బ్యాంకులలో (పీఎస్‌బీ) కేంద్ర ప్రభుత్వ వాటా తగ్గలేదని అన్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వ వాటాల సంఖ్య తగ్గకపోయినా, బ్యాంకులు కొత్త షేర్లను జారీ చేయడం ద్వారా మూలధనాన్ని సేకరించడం కోసం ఈ బ్యాంకుల్లోని కొన్నింటిలో కేంద్ర ప్రభుత్వ వాటాల శాతం తగ్గిందని ఆయన తెలిపారు. వ్యాపార వృద్ధికి, నియంత్రణ అవసరాలను నిర్వహించడానికి బ్యాంకులు కొత్త నిధులను సేకరిస్తాయి. ఆ మూలధన నిధులు ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయి, బ్యాంకుల బ్యాలెన్స్ షీట్‌నూ బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.

Next Story