- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Auto Industry: వాహన పరిశ్రమలో కొత్త కష్టాలు
కొన్ని కంపెనీలు మెరుగైన అమ్మకాలను సాధిస్తే, ఈ రంగంలో వేళ్లూనుకున్న కొన్ని కంపెనీలు అమ్మకాల్లో క్షీణతను చూశాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ వాహన పరిశ్రమకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. కొవిడ్ మహమ్మారి తర్వాత కార్లు, టూవీలర్ వాహనాల తయారీ కంపెనీలకు ఇన్‌పుట్ ఖర్చులతో పాటు ఇతర వ్యయాల వల్ల కొన్నాళ్లు ఇబ్బందులు తలెత్తాయి. దాన్నుంచి కోలుకుని స్థిరమైన వృద్ధిని సాధిస్తున్న క్రమంలో వినియోగదారుల్లో వచ్చిన మార్పునకు తోడు ఈ ఏడాది భూమిలో దొరికే అరుదైన ఖనిజాల కొరత వంటి అంశాలు వాహన పరిశ్రమకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వాహన పరిశ్రమ మిశ్రమ అమ్మకాల డేటాను నమోదు చేసింది. కొన్ని కంపెనీలు మెరుగైన అమ్మకాలను సాధిస్తే, ఈ రంగంలో వేళ్లూనుకున్న కొన్ని కంపెనీలు అమ్మకాల్లో క్షీణతను చూశాయి. విలాసవంతమైన, పెద్ద కార్లను కొనేవారు పెరుగుతున్న కొద్దీ, చిన్న కార్లను కొనే వారి సంఖ్య భారీగా పడిపోతోంది.
దేశంలోనే అతిపెద్ద ఎస్‌యూవీ తయారీ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య అత్యధిక అమ్మకాలు 22 శాతం పెరిగి 1.52 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే సమయంలో 1.24 లక్షల యూనిట్లను కంపెనీ విక్రయించింది. ఇందుకు కారణంగా మహీంద్రాకు ఎస్‌యూవీ విభాగంలో ఎక్కువ కార్లు ఉండటం. ఇదే సమయంలో దేశంలోనే అతిపెద్ద ప్యాసింజర్ కార్ల కంపెనీ మారుతీ సుజుకి అమ్మకాలు 6.9 శాతం తగ్గి 3.94 లక్షల యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే సమయంలో 4.19 లక్షల కార్లను కంపెనీ విక్రయించింది. ప్రధానంగా చిన్న కార్ల సెగ్మెంట్‌లో పడిపోతున్న ధోరణిని సూచిస్తుంది.
బడ్జెట్ కార్లను కొనేవారు లేరు
గతంలో చిన్న కార్ల సెగ్మెంట్ దేశ జీడీపీ కంటే ఒకటిన్నర రెట్లు పెరిగేది. కానీ ఇప్పుడు దేశ జీడీపీ 6.5 శాతం పెరుగుతుంటే ఈ విభాగం ఫ్లాట్‌గా ఉంది. కఠిన నిబంధనలు, ఇతర కారణాలతో చిన్న కార్ల సెగ్మెంట్ కార్ల అమ్మకాలు 70 శాతం పడిపోయినట్టు మారుతీ సుజుకి కార్పొరేట్ వ్యవహారాల సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారీ చెప్పారు. హ్యూండాయ్ మోటార్ ఇండియా కూడా అమ్మకాల పరంగా 13 శాతం వృద్ధిని చూసింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 1.32 లక్షల కార్లను విక్రయించింది.
మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)కు మళ్లుతున్న కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది. సమీక్షించిన త్రైమాసికంలో ఈవీ కార్ల అమ్మకాలు 34 శాతం పెరిగాయి. అత్యధికంగా టాటా మోటార్స్, ఎంజీ మోటార్స్ కంపెనీలు 10 వేలకు పైగా ఈవీలను విక్రయించాయి. ఆ తర్వాత మహీంద్రా, హ్యూండాయ్ ఉన్నాయి.






