ఏప్రిల్ 1 నుంచి ఏటీఎం, యూపీఐ వాడకంలో కీలక మార్పులు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-22 07:22:20  IST  )

ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏటీఎం, యూపీఐ వాడకంలో కీలక మార్పులు రానున్నాయి.

ఏప్రిల్ 1 నుంచి ఏటీఎం, యూపీఐ వాడకంలో కీలక మార్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభం కావడంతో ఏప్రిల్ 1 నుండి బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా ఏటీఎం నగదు ఉపసంహరణ పరిమితులు, లావాదేవీల చార్జీల విషయంలో ప్రముఖ బ్యాంకులు కొత్త నిబంధనలను ప్రకటించాయి. ఈ మార్పులు సామాన్య ఖాతాదారుల జేబుపై ప్రభావం చూపనున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank):

ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ఏటీఎం పాలసీని సవరించింది. ఇప్పటివరకు యూపీఐ (UPI) ద్వారా ఏటీఎంలలో చేసే నగదు ఉపసంహరణలను ప్రత్యేక కేటగిరీగా పరిగణించేవారు. కానీ ఏప్రిల్ 1 నుండి వీటిని కూడా నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితిలోనే (Monthly Free Limits) చేర్చనున్నారు. అంటే.. మీరు కార్డుతో తీసినా లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తీసినా అవి ఉచిత పరిమితి కిందకే వస్తాయి. ఒకవేళ నెలవారీ ఉచిత విత్ డ్రా లిమిట్ దాటితే, ప్రతి అదనపు లావాదేవీకి రూ. 23 (ప్లస్ పన్నులు) చార్జీ వసూలు చేస్తారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB):

ప్రభుత్వ రంగ సంస్థ పీఎన్‌బీ తన డెబిట్ కార్డుల రోజువారీ నగదు ఉపసంహరణ పరిమితిని తగ్గించింది. గతంలో కొన్ని కార్డులపై రోజుకు రూ. 1,00,000 వరకు తీసుకునే వెసులుబాటు ఉండగా, ఇప్పుడు దానిని కార్డ్ రకాన్ని బట్టి రూ.50,000 నుండి రూ. 75,000 కు పరిమితం చేశారు. రిస్క్ మేనేజ్‌మెంట్, అనధికారిక లావాదేవీలను అరికట్టడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ తెలిపింది.

జియో పేమెంట్స్ బ్యాంక్ (Jio Payments Bank):

డిజిటల్ బ్యాంకింగ్‌ను ప్రోత్సహించే దిశగా జియో పేమెంట్స్ బ్యాంక్ సరికొత్త 'క్యూఆర్ కోడ్' ఆధారిత విత్‌డ్రాయల్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల ఖాతాదారులు డెబిట్ కార్డ్ అవసరం లేకుండానే, కేవలం యూపీఐ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నిర్ణీత బ్యాంకింగ్ పాయింట్ల వద్ద నగదు తీసుకోవచ్చు. ఈ మార్పుల నేపథ్యంలో ఖాతాదారులు తమ బ్యాంకు పరిమితులను ఒకసారి సరిచూసుకోవాలని, అనవసరపు చార్జీలు పడకుండా లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Next Story