Anant Ambani: అనంత్ అంబానీ పేరుతో రూ. 14 కోట్ల స్పెషల్ వాచ్

by S Gopi |

అనంత్ అంబానీ గుజరాత్‌లో నిర్వహిస్తున్న వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం వంతారాకు అంకితమిస్తూ రూపొందించారు.

Anant Ambani: అనంత్ అంబానీ పేరుతో రూ. 14 కోట్ల స్పెషల్ వాచ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ లగ్జరీ వాచ్‌ల తయారీ సంస్థ జాకబ్ అండ్ కో సరికొత్త వాచ్‌ను విడుదల చేసింది. దీని ఖరీదు సుమారు 1.5 మిలియన్ డాలర్లు, అంటే మన కరెన్సీలో ఏకంగా రూ. 13.7 కోట్లు ఉంటుంది. ఒపెరా వంతారా గ్రీన్ కామో పేరుతో తెచ్చిన ఈ వాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ వాచ్‌ను రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ గుజరాత్‌లో నిర్వహిస్తున్న వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం వంతారాకు అంకితమిస్తూ రూపొందించారు. దీని ధర కోట్లలో ఉన్నప్పటికీ, వన్యప్రాణుల సంరక్షణకు గుర్తుగా తీసుకురావడం అంతకు మించి విలువైనదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఒపెరా వంతారా గ్రీన్ కామో కేవలం సమయాన్ని మాత్రమే సూచించదు, ఇది ఒక కథను చెబుతుందని జాకబ్ అండ్ కో కంపెనీ అభిప్రాయపడింది. డిజైన్ పరంగా ఈ వాచ్ డయల్ మధ్యలో చేత్తో చిత్రించిన అనంత్ అంబానీ అతిచిన్న బొమ్మ ఉంటుంది. దానికి ఇరువైపులా చిన్న సైజ్ సింహం, బెంగాల్ పులి శిల్పాలు ఉన్నాయి. ఇక, ఈ వాచ్ కేస్, డయల్‌పై డెమంటాయిడ్ గార్నెట్‌లు, సవోరైట్‌లు, ఆకుపచ్చ నీలమణి, తెల్లటి వజ్రాలతో సహా మొత్తం 21.98 క్యారెట్ల బరువున్న 397 రత్నాలను పొదిగారు. ఈ రత్నాలు కళాత్మకంగా డయల్, కేస్ చుట్టూ ఒక చిన్న అటవీ ప్రకృతి దృశ్యంలా డిజైన్ చేసినట్టు కంపెనీ వెల్లడించింది.

Next Story