మళ్లీ 71,000 పైకి సెన్సెక్స్

by Dishanational1 |
మళ్లీ 71,000 పైకి సెన్సెక్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల తర్వాత లాభాలను సాధించాయి. అంతకుముందు ట్రేడింగ్‌లో వెయ్యికి పైగా పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ బుధవారం తిరిగి పుంజుకుంది. భారీ అమ్మకాల తర్వాత కీలక హెచ్‌డీఈఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ కంపెనీల షేర్లలో తిరిగి పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరగడంతో సూచీలకు కలిసొచ్చింది. ప్రధానంగా ఆటో, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఎనర్జీ రంగాల్లో మదుపర్లు భారీగా కొనుగోళ్లకు దిగారు. వీటికితోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, జనవరి నెల ఎఫ్అండ్ఓ గడువు ముగింపు వంటి అంశాలు కొనుగోళ్ల సెంటిమెంట్‌ను పెంచాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 689.76 పాయింట్లు ఎగసి 71,060 వద్ద, నిఫ్టీ 215.15 పాయింట్లు లాభపడి 21,453 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మీడియా, మెటల్, బ్యాంకింగ్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా కంపెనీల షేర్లు 3 శాతానికి పైగా పుంజుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.13 వద్ద ఉంది. మార్కెట్ల ర్యాలీతో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ బుధవారం ఒక్కరోజే రూ. 5.42 లక్షల కోట్లు పెరిగి రూ. 371.4 లక్షల కోట్లకు చేరుకుంది.


Next Story

Most Viewed