Infosys: ఉద్యోగులకు 80 శాతం బోనస్ ప్రకటించిన ఇన్ఫోసిస్

by S Gopi |

ఈ బోనస్ చెల్లింపు పనితీరు ఆధారంగా ఉంటుందని ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది.

Infosys: ఉద్యోగులకు 80 శాతం బోనస్ ప్రకటించిన ఇన్ఫోసిస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల ఐటీ కంపెనీలు ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెబుతున్నాయి. తాజాగా ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు భారీ మొత్తం బోనస్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి కంపెనీ పనితీరు మెరుగ్గా ఉండటంతో అర్హత ఉన్న ఉద్యోగులందరికీ సగటున 80 శాతం బోనస్ ఇస్తామని వెల్లడించింది. ఆగష్టు నెల జీతంతో కలిపు ఈ మొత్తాన్ని చెల్లిస్తామని కంపెనీ పేర్కొంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉద్యోగులకు మెయిల్ ద్వారా సమాచారం అందించినట్టు మనీకంట్రోల్ కథనం పేర్కొంది. ఈ బోనస్ చెల్లింపు పనితీరు ఆధారంగా ఉంటుందని ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. పీఎల్4 ఉద్యోగులకు 80-89 శాతం మధ్య, పీఎల్5 ఉద్యోగులకు 78-87 శాతం మధ్య, పీఎల్6 ఉద్యోగులు వారి పనితీరును బట్టి 75-85 శాతం మధ్య బోనస్ ఇవ్వనుంది. పీఎల్‌4, పీఎల్‌5, పీఎల్‌6 కేటగిరీల్లో ఉండి పనితీరుపై మరింత శ్రద్ధ వహించాల్సిన ఉద్యోగులకు కూడా కంపెనీ అంతే బోనస్ ఇవ్వనున్నట్టు ఇంటర్నల్ మెమోలో పేర్కొంది. కాగా, సమీక్షించిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ రూ. 6,921 కోట్లతో నికర లాభాల్లో 8.7 శాతం వృద్ధిని సాధించింది. ఆదాయం కూడా 7.5 శాతం పెరిగి రూ. 42,279 కోట్లుగా ప్రకటించింది.

Next Story