Unemployment: జూలైలో 5.2 శాతానికి తగ్గిన నిరుద్యోగిత రేటు: ప్రభుత్వ సర్వే

by S Gopi |

సమీక్షించిన నెలలో అన్ని వయసుల వారి నిరుద్యోగిత రేటు 5.2 శాతంగా ఉంది.

Unemployment: జూలైలో 5.2 శాతానికి తగ్గిన నిరుద్యోగిత రేటు: ప్రభుత్వ సర్వే
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో నిరుద్యోగ రేటు గత నెలలో 5.2 శాతానికి చేరింది. ఇది అంతకుముందు జూన్‌లో నమోదైన 5.6 శాతం కంటే తగ్గిందని సోమవారం విడుదలైన ప్రభుత్వ సర్వే వెల్లడించింది. ఈ మేరకు గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్)లో పేర్కొంది. సమీక్షించిన నెలలో అన్ని వయసుల వారి నిరుద్యోగిత రేటు 5.2 శాతంగా ఉంది. పురుషులలో నిరుద్యోగిత రేటు 5.3 శాతం వద్ద ఉండగా, మహిళల్లో 5.1 శాతంతో కొంచెం తక్కువగా ఉంది. పట్టణ ప్రాంతాలలో అన్ని వయసుల వారికి నిరుద్యోగ రేటు 7.1 శాతం నుంచి 7.2 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాలలో ఇది 4.9 శాతం నుంచి 4.4 శాతం తగ్గింది. 15-29 ఏళ్ల వయస్సు గల యువతలో నిరుద్యోగం జూన్‌లో 15.3 శాతం నుంచి గత నెలలో 14.9 శాతానికి తగ్గింది. అయితే, ఈ వయస్సు గలవారిలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు జూలైలో 19 శాతానికి స్వల్పంగా పెరిగింది, అంతకుముందు నెలలో 18.8 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అదే వయసువారి రేటు జూన్‌లో 13.8 శాతం నుంచి జూలైలో 13 శాతానికి తగ్గింది. శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు(ఎల్ఎఫ్‌పీఆర్) గత నెలలో 41.4 శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Next Story