- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Smartphone Exports: అమెరికాకు మూడు రెట్లు పెరిగిన స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు
అమెరికా టారిఫ్ సంబంధిత అనిశ్చితులు డిమాండ్, ధరలపై ప్రభావం చూపే ప్రమాదం ఉన్నప్పటికీ ఎగుమతులు స్థిరంగా ఉన్నా..

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ వాణిజ్యంలో సవాళ్లు ఉన్నప్పటికీ, ఈ ఏడాది అక్టోబర్‌లో మనదేశం నుంచి అమెరికాకు స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు మూడు రెట్లు పెరిగి 1.47 బిలియన్ డాలర్ల(రూ. 13.26 వేల కోట్ల)కు చేరుకున్నాయి. గతేడాది అక్టోబర్‌లో వీటి ఎగుమతుల విలువ 0.46 బిలియన్ డాలర్లు(రూ. 4,150 కోట్లు)గా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలో అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 10.78 బిలియన్ డాలర్ల(రూ. 97 వేల కోట్లకు పైగా) పెరిగాయి. గత సంవత్సరం ఇదే కాలంలో 3.60 బిలియన్ డాలర్లు(రూ. 32.5 వేల కోట్లు)గా ఉందని డేటా పేర్కొంది. అమెరికా ప్రభుత్వం విధించిన అధిక టారిఫ్ సంబంధిత అనిశ్చితులు డిమాండ్, ధరలపై ప్రభావం చూపే ప్రమాదం ఉన్నప్పటికీ స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు స్థిరంగా ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. ప్రధాన కంపెనీలు ముఖ్యంగా యాపిల్ చైనా నుంచి భారత్‌కు ఉత్పత్తిని మార్చడం వల్ల మన దేశం నుంచి ఎక్కువ ఎగుమతులు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో భారత ప్రభుత్వం స్థానిక తయారీకి విధానాలు, ప్రోత్సాహకాలతో మద్దతివ్వడంతో హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు మనదేశంలోనే తయారవుతున్నాయి. పెరుగుతున్న తయారీ, సరఫరా కారణంగా భారత్‌లో ఉత్పత్తి పెరిగి ఎగుమతుల సామర్థ్యం ఊపందుకుంది. మరోవైపు ప్రపంచ వాణిజ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు అమెరికా కొనుగోలుదారులకు భారత్ నుంచి ఎక్కువ కొనేందుకు కారణమయ్యాయి. ఈ పరిణామాలు యాపిల్‌తో పాటు శాంసంగ్, మోటొరోలా వంటి ఇతర స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు కూడా భారత్ నుంచి ఎగుమతులు పెంచేందుకు దోహదపడ్డాయి.






