GST Collections: రూ. 2 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

by S Gopi |

దేశీయంగా అమ్మకాలు పుంజుకోవడంతో పాటు దిగుమతులు మెరుగుపడటం పన్ను ఆదాయానికి దోహదపడ్డాయని కేంద్రం వెల్లడించింది.

GST Collections: రూ. 2 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు మరోసారి భారీగా నమోదయ్యాయి. ఈ ఏడాది మార్చి నెలకు సంబంధించి మొత్తం జీఎస్టీ ఆదాయం రూ. 2 లక్షల మార్కును దాటింది. దేశీయంగా అమ్మకాలు పుంజుకోవడంతో పాటు దిగుమతులు మెరుగుపడటం పన్ను ఆదాయానికి దోహదపడ్డాయని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన గణాంకాలు ప్రకారం, సమీక్షించిన నెలలో మొత్తం జీఎస్టీ వసూళ్లు 8.8 శాతం పెరిగి రూ. 2,00,064 కోట్లు నమోదయ్యాయి. ఇది 2025-26 ఆర్థిక సంవత్సరంలో నమోదైన మూడవ అత్యధిక నెలవారీ వసూలు కావడం విశేషం. గతేడాది ఏప్రిల్‌లో రూ. 2.36 లక్షల కోట్లతో అత్యధిక వసూళ్లు నమోదవగా, ఆ తర్వాతి స్థానంలో మే నెల వసూళ్లు రూ. 2.01 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో రూ. 1.83 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చింది. దేశీయంగా మాత్రమే వచ్చిన ఆదాయం 5.9 శాతం పెరిగి రూ. 1.46 లక్షల కోట్లకు చేరుకోగా, దిగుమతుల ద్వారా వచ్చిన ఆదాయాలు 17.8 శాతం వృద్ధి చెంది రూ. 53,861 కోట్లకు చేరాయి. ఇక, మొత్తం 2025-26లో జీఎస్టీ వసూళ్లు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 8.3 శాతం వృద్ధి చెంది రూ. 22.27 లక్షల కోట్లకు పైగా చేరుకున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధికంగా రూ. 2,168 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదు చేసింది. ఇది గతేడాది రూ. 1,822 కోట్ల కంటే 19 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఇతర ప్రధాన రాష్ట్రాల్లో తెలంగాణలోనే అత్యధిక వృద్ధి నమోదైంది. ఏపీలో జీఎస్టీ ఆదాయం 1 శాతం పెరిగి రూ. 1,399 కోట్ల నుంచి రూ. 1,416 కోట్లకు పెరిగాయి.

Next Story