- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold: రికార్డు స్థాయిలో ధరలున్నా రెట్టింపు పెరిగిన బంగారం, వెండి దిగుమతులు
గత రెండు వారాలుగా ఆభరణాల వ్యాపారులు, బ్యాంకులు కస్టమ్స్ నుంచి చాలా బంగారాన్ని క్లియరెన్స్ పొందుతున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అయినప్పటికీ కొనుగోళ్లు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఇదే సమయంలో ఈ ఏడాది ఆగష్టుతో పోలిస్తే సెప్టెంబర్‌లో బంగారం, వెండి దిగుమతులు దాదాపు రెట్టింపు అయ్యాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందుకు ప్రధానంగా రికార్డు స్థాయిలో ధరలు పెరగడం, బ్యాంకులతో పాటు ఆభరణాల వ్యాపారులు పండుగలకు ముందు నిల్వలను పెంచుకోవాలని, దిగుమతులపై అధిక పన్నుల నుంచి తప్పించుకోవాలని భావిస్తుండటమే కారణం. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద పసిడి దిగుమతి దేశంగా భారత్ అధికంగా దిగుమతి చేసుకోవడంతో ఈ వారం బంగారం ధరలు పెరిగేందుకు మద్దతు ఇస్తున్నాయి. బంగారం దిగుమతులు పుంజుకోవడం వల్ల దేశ వాణిజ్య లోటు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే బలహీనంగా ఉన్న భారత కరెన్సీ రూపాయిపై భారం పడుతుంది. గత రెండు వారాలుగా ఆభరణాల వ్యాపారులు, బ్యాంకులు కస్టమ్స్ నుంచి చాలా బంగారాన్ని క్లియరెన్స్ పొందుతున్నారని ఓ ప్రభుత్వాధికారి చెప్పారు. గత కొన్నేళ్లలోనే ఈ స్థాయిలో బంగారం క్లియరెన్స్ ప్రక్రియ చూడలేదని ఆయన అభిప్రాయపడ్డారు. గణాంకాల ప్రకారం, ఆగష్టులో భారత్‌లోకి మొత్తం 64.17 టన్నుల బంగారం, 410.8 టన్నుల వెండి దిగుమతి అయ్యిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి ఖచ్చితమైన డేటా అక్టోబర్ రెండో వారంలో విడుదల కానుంది.
కొత్త గరిష్ఠాలకు ధరలు
మరోవైపు మంగళవారం బంగారం ధరలు కొత్త రికార్డు గరిష్ఠాలకు చేరాయి. అమెరికా డాలర్ విలువ బలహీనపడటం, ఫెడ్ వడ్డీ రేట్లలో కోత విధిస్తుందనే అంచనాలు పెరగడం మూలంగా దేశ రాజధానిలో పసిడి ధరలు రూ. 500 పెరిగి తొలిసారిగా రూ. 1.20 లక్షల మార్కును చేరాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన పసిడి పది గ్రాములు రూ. 720 పెరిగి రూ.1,20,643 వద్ద ఉంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,10,590కి చేరింది. వెండి సైతం బంగారం స్థాయిలో కొత్త రికార్డులను తాకుతోంది. మంగళవారం వెండి కిలో రూ. 1,61,000(అన్ని పన్నులు కలిపి)ను చేరింది. గ్లోబల్ మార్కెట్లలోనూ ఔన్సు స్పాట్ గోల్డ్ స్వల్పంగా తగ్గి 3,813.14 డాలర్లుగా ఉంది. స్పాట్ సిల్వర్ కూడా 1.51 శాతం క్షీణించి ఔన్సుకు 46.22 డాలర్ల వద్ద ఉంది.






