Economy: భారత వృద్ధి అంచనాలను పెంచిన డెలాయిట్ ఇండియా

by S Gopi |

గిరాకీ పెరగడం, సంస్కరణలు వృద్ధి స్థిరత్వాన్ని కొనసాగించడం వల్ల ఇతర దేశాల కంటే భారత్ బలంగా ఎదుగుతుందనే సంకేతాలిస్తోందని..

Economy: భారత వృద్ధి అంచనాలను పెంచిన డెలాయిట్ ఇండియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా డిమాండ్ బలపడటం, ప్రభుత్వ సంస్కరణల నేపథ్యంలో భారత వృద్ధి రేటును సవరిస్తున్నట్టు డెలాయిట్ ఇండియా తెలిపింది. గురువారం సంస్థ విడుదల చేసిన 'ఇండియా ఎకనమిక్ ఔట్‌లుక్' నివేదికలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థికవ్యవస్థ 6.7-6.9 శాతం మధ్య వృద్ధిని నమోదు చేయనుందని అభిప్రాయపడింది. ఇది గతంలో అంచనా వేసిన 6.3 శాతం కంటే ఎక్కువ. వినియోగ గిరాకీ పెరగడం, సంస్కరణలు వృద్ధి స్థిరత్వాన్ని కొనసాగించడం వల్ల ఇతర దేశాల కంటే భారత్ బలంగా ఎదుగుతుందనే సంకేతాలిస్తోందని నివేదిక తెలిపింది. వృద్ధికి దేశీయ డిమాండ్, అనుకూల పాలసీ విధానాలు, జీఎస్టీ 2.0 నిర్మాణాత్మక సంస్కరణలు మద్దతిచ్చే అవకాశం ఉంది. కొనుగోలు శక్తి మెరుగుపడటంతో ద్రవ్యోల్బణం తగ్గుతుందని, తద్వారా ఖర్చులూ తగ్గుతాయని నివేదిక వివరించింది. వినియోగ వ్యయంలో గణనీయమైన పెరుగుదల వల్ల ఈ ఏడాది పండుగ త్రైమాసికంలో డిమాండ్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని డెలాయిట్ ఇండియా ఆర్థికవేత్త రుమ్కి మజుందార్ అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే స్థాయి వృద్ధికి అవకాశం ఉంది. కానీ వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించిన అనిశ్చితుల వల్ల వృద్ధిపై కొంత ఒత్తిడి ఉండే ఉండవచ్చని నివేదిక పేర్కొంది.

Next Story