Economy: 2025-26లో భారత వృద్ధి 6.5 శాతం

by S Gopi |

మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేస్తున్న మూలధన వ్యయాలు రానున్న సంవత్సరాల్లో ఫలితాలివ్వనున్నాయి.

Economy: 2025-26లో భారత వృద్ధి 6.5 శాతం
X

దిశ, బిజినెస్ బ్యూరో: కొత్త ఆర్థిక సంవత్సరం భారత ఆర్థికవ్యవస్థ 6.5 శాతం మేర వృద్ధి చెందుతుందని ఈవై ఎకానమీ అంచనా వేసింది. మార్చి నెలకు సంబంధించిన నివేదిక విడుదల సందర్భంగా.. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ జీడీపీ 6.4 శాతంగా అంచనా వేస్తూ, ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే 2025-26లో వృద్ధి 6.5 శాతంగా ఉంటుందని తెలిపింది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేస్తున్న మూలధన వ్యయాలు రానున్న సంవత్సరాల్లో ఫలితాలివ్వనున్నాయి. సేవలు, కొన్నిరకాల వస్తువుల ఎగుమతుల్లో మెరుగైన వృద్ధి కూడా ఆర్థిక కార్యకలాపాలకు దోహదపడుతుందని అభిప్రాయపడింది. ఇదే సమయంలో వికసిత్ భారత్ వైపు ప్రయాణానికి మద్దతుగా ఆర్థిక విధానాలను పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. పెరుగుతున్న జనాభా, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక నిర్మాణానికి ధీటుగా దీర్ఘకాలిక వృద్ధిని కొనసాగించడానికి, మానవ మూలధన ఫలితాలను మెరుగుపరచడానికి విద్య, ఆరోగ్య సంరక్షణలో అదనపు పెట్టుబడులు అవసరం కావచ్చు. రాబోయే రెండు దశాబ్దాలలో భారత్ సాధారణ ప్రభుత్వ విద్య, ఆరోగ్య వ్యయాలను క్రమంగా పెంచడం, ద్వారా అధిక ఆదాయ దేశాలలో కనిపించే స్థాయిలకు దగ్గరగా ఉంటుంది. దేశంలోని యువత, పెరుగుతున్న శ్రామికశక్తిని పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం విద్య కోసం జీడీపీలో 4.6 శాతానికి సమానమైన మొత్తం ఖర్చు చేస్తున్నారు. దీన్ని 2048 నాటికి 6.5 శాతానికి పెంచాలి. అలాగే ఆరోగ్యం కోసం ఇప్పుడున్న 1.1 శాతం నుంచి 2048 నాటికి 3.8 శాతానికి పెంచాలని నివేదిక సూచించింది.

Next Story