- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Economy: రేట్ల కోతలు, పన్ను ఉపశమనాలతో భారత వృద్ధికి ఢోకా లేదు
ఆర్‌బీఐ ఎంపీసీ కీలక రేట్లలో మరో 25-50 బేసిస్ పాయింట్ల కోతకు నిర్ణయం తీసుకోవచ్చని పీడబ్ల్యూసీ ఆర్థికవేత్తలు తెలిపారు.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత వృద్ధి రేటుపై క్రమంగా అంచనాలు పెరుగుతున్నాయి. ఇటీవల ఐఎంఎఫ్ దేశ జీడీపీ 6.4 శాతం మేర పుంజుకోగలదని అభిప్రాయపడింది. తాజాగా పలువురు ఆర్థికవేత్తలు సైతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి 6.5 శాతం పెరుగుతుందని అంచనా కట్టింది. ఇందుకు ప్రధానంగా అనుకూలమైన వడ్డీ రేట్లు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆదాయ పన్ను తగ్గింపు, పట్టణ డిమాండ్ పెరిగే అవకాశం వంటివి సహకరిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం 3.7 శాతం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తెలిపింది. ఫలితంగా ఆర్‌బీఐ ఎంపీసీ కీలక రేట్లలో మరో 25-50 బేసిస్ పాయింట్ల కోతకు నిర్ణయం తీసుకోవచ్చని పీడబ్ల్యూసీ ఆర్థికవేత్తలు రానెన్ బెనర్జీ, మనోరంజన్ పటానాయక్ తెలిపారు. వడ్డీ రేట్ల తగ్గింపు, పన్ను ఉపశమనం ఆర్థికవ్యవస్థపై ఇప్పటికిప్పుడు కాకపోయిన ఆలస్యంగానైనా సానుకూల ప్రభావం చూపుతాయని వారు అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాల కారణంగా 2025-26 రెండో త్రైమాసికంలో కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు అంతకుముందు కంటే మెరుగ్గా నమోదయ్యే అవకాశాలున్నాయి.
ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉండేలా చూసుకోవడానికి ప్రభుత్వం వచ్చే దశాబ్దం పాటు మౌలిక సదుపాయాల పెట్టుబడుల విషయంలో ఇదే ఊపును కొనసాగించాల్సిన అవసరం ఉందని బెనర్జీ స్పష్టం చేశారు. మరోవైపు, గ్రామీణంలో పెరుగుతున్న వేతనాలలు ఆ ప్రాంతాల్లో వినియోగాన్ని పెంచుతుందని, తద్వారా మొత్తం ఆర్థిక కార్యకలాపాలకు అది మద్దతు ఇస్తుందని రానెన్ బెనర్జీ తెలిపారు. సాధారణం కంటే ఎక్కువ రుతుపవనాలు వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూరుస్తాయని, గ్రామీణ డిమాండ్‌ను మరింత పెంచుతాయని ఆయన అన్నారు. అయితే, ప్రపంచ వాణిజ్యంలో నెలకొన్న అనిశ్చితి వల్ల ఈ రంగం ఎగుమతులపై ఒత్తిడి ఉందని ఆయన పేర్కొన్నారు.






