Auto Sales: వాహన అమ్మకాల్లో పండుగ జోష్.. మారుతీ, టీవీఎస్ రికార్డులు

by S Gopi |

మారుతీ సుజుకి, టూ-వీలర్ దిగ్గజం టీవీఎస్ సరికొత్త రికార్డులు నమోదు చేశాయి.

Auto Sales: వాహన అమ్మకాల్లో పండుగ జోష్.. మారుతీ, టీవీఎస్ రికార్డులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది పండుగ సీజన్ నెలలో వాహన విక్రయాలకు సంబంధించి కొత్త రికార్డులు నమోదయ్యాయి. కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా పన్ను రేట్లు తగ్గడంతో పాటు పండుగ సీజన్ డిమాండ్, వినియోగదారుల నుంచి బలమైన సెంటిమెంట్ కారణంగా అక్టోబర్ నెల ఆటో పరిశ్రమలో భారీగా టోకు అమ్మకాలు జరిగాయి. దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకి, టూ-వీలర్ దిగ్గజం టీవీఎస్ సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. ప్రధాన వాహన తయారీ కంపెనీలు హ్యుండాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్, కియా ఇండియా గతేడాది కంటే ఎక్కువ అమ్మకాలను సాధించాయి. మారుతీ సుజుకీ అక్టోబర్‌ నెలలో మొత్తం 2,20,894 వాహనాలను విక్రయించింది. ఇప్పటివరకు నెలవారీగా ఇవే అత్యధిక అమ్మకాలని కంపెనీ తెలిపింది. దేశీయంగా 180,675 యూనిట్లు అమ్మగా, 31,304 వాహనాలను ఎగుమతి చేసింది. హ్యుండాయ్ మోటార్ ఇండియా 53,792 యూనిట్లు దేశీయంగా, 16,102 ఎగుమతులతో సహా 69,894 వాహనాలను విక్రయించింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా 1.2 లక్షల వాహనాలను విక్రయించింది. వీటిలో దేశీయంగా 71,624, 4,015 వాహనాల ఎగుమతి చేసింది. త్రీవీలర్‌ విభాగంలో 12,762 యూనిట్ల అమ్మకాలు సాధించింది. టొయోటా కిర్లోస్కర్ దేశీయంగా 40,257, ఎగుమతుల్లో 2,635 యూనిట్ల అమ్మకాలను సాధించింది. కియా ఇండియా రికార్డు స్థాయిలో 30 శాతం వృద్ధితో 29,556 వాహనాలను విక్రయించింది.

టీవీఎస్ మోటార్ కంపెనీ 11 శాతం అధికంగా మొత్తం 5.43 లక్షల యూనిట్లను విక్రయించింది. టూవీలర్లలో అమ్మకాలు 10 శాతం పెరిగి 5.25 లక్షల యూనిట్లకు చేరుకోగా, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) అమ్మకాల్లో 11 శాతం పెరిగి 32,387 యూనిట్లకు చేరుకున్నాయి. ఎగుమతులు 21 శాతం పెరిగి 1.15 లక్షల యూనిట్లకు చేరాయి. త్రీ వీలర్ అమ్మకాలు 70 శాతం పెరిగి 18,407 యూనిట్లకు చేరుకున్నాయి.

Next Story