Ratan Tata: రతన్ టాటా వీలునామాలో ఎక్కువ మొత్తం ఛారిటీకే

by S Gopi |

టాటా సన్స్‌లో తన వాటాను విక్రయించాల్సి వస్తే సంస్థలోని ఇప్పుడున్న వాటాదారులకే ఇవ్వాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

Ratan Tata: రతన్ టాటా వీలునామాలో ఎక్కువ మొత్తం ఛారిటీకే
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ పారిశ్రామికవేత్త, దివంగత రతన్ టాటా వీలునామా అంశం మరోసారి చర్చనీయాంశం అయింది. ఆయన మరణానంతరం రూ. 10 వేల కోట్ల కంటే ఎక్కువగా ఉన్న ఆస్తులు ఎవరెవరికీ చెందుతాయనే కథనాలు వస్తూనే ఉన్నాయి. తాజా ఎకనమిక్ టైమ్స్ ప్రకారం, రతణ్ టాటా మొత్తం ఆస్తుల్లో అత్యధిక భాగం రూ. 3,800 కోట్లు రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్ (ఆర్‌టీఈఎఫ్), రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్ట్ (ఆర్‌టీఈటీ) వంటి ధార్మిక, దాతృత్వ ప్రయోజనాల కోసం కేటాయించారు. ఈ కేటాయింపుల్లో రతన్ టాటా వాటాలు, ఇతర ఆస్తులు ఉన్నాయి. టాటా సన్స్‌లో తనకున్న వాటాను విక్రయించాల్సి వస్తే సంస్థలోని ఇప్పుడున్న వాటాదారులకే ఇవ్వాలని ఆయన వీలునామాలో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. 2024, అక్టోబర్‌లో మరణించిన రతన్ టాటా, బ్యాంకులలోని ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీలు), స్టాక్స్,, గడియారాలు, పెయింటింగ్‌లు సహా తన ఇతర ఆర్థిక ఆస్తులలో మూడింట ఒక వంతును తన ఇద్దరు సోదరీమణులు అయిన షిరీన్ జేజీబోయ్, దీనా జీజీబోయ్‌లకు ఇచ్చారు. వీటి విలువ రూ. 800 కోట్లుగా ఉండొచ్చని అంచనా.

అలాగే, జుహూలోని బంగా, కొన్ని వెండి వస్తువులు, బంగారు ఆభరణాలను సోదరుడు జిమ్మీ టాటాకు ఇచ్చారు. టాటా గ్రూప్‌ మాజీ ఉద్యోగి, రతన్‌కు అత్యంత సన్నిహితుడు మోహిన్‌ దత్తాకు కూడా రూ.800 కోట్ల విలువైన ఆస్తులు ఇచ్చారు. ఇక, రతన్ టాటా చివరి రోజుల్లో తనకు కేర్ టేకర్‌, మేనేజర్‌గా ఉన్న యువ మిత్రుడు శంతను నాయుడుకు కూడా సాయమందించేలా వీలునామాలో వివరాలు ఉన్నట్టు సమాచారం. శంతను నాయుడు పేరు మీద ఉన్న ఎడ్యుకేషన్ లోన్‌ను మాఫీ చేయాలని పేర్కొన్నారు. మూగజీవాలపై ఎంతో ప్రేమ చూపించిన రతన్ టాటా వాటికోసం కూడా కాప్రస్ ఫండ్ కేటాయించారు. వీధి శునకాల సంరక్షణ కోసం రూ. 12 లక్షల ఫండ్‌తో ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ. 30 వేలు ఖర్చు చేయాలని చెప్పారు. ఇవి కాకుండా ఇతర పలు కేటాయింపులు, ఆస్తుల వివరాలు వీలునామాలో పొందుపరిచారు. ఈ వీలునామా 2022, ఫిబ్రవరిలో రాసినట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తవడానికి ఇంకో ఆరు నెలల సమయం పట్టొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Next Story