Term Insurance: టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా ఎంచుకోవాలంటే..!

by S Gopi |

ప్రస్తుతం టర్మ్ ఇన్సూరెన్స్ పొందాలంటే ఆన్‌లైన్‌లో సులభంగా కొనుగోలు చేసే మార్గాలున్నాయి.

Term Insurance: టర్మ్ ఇన్సూరెన్స్ ఎలా ఎంచుకోవాలంటే..!
X

దిశ, బిజినెస్ బ్యూరో: మనం సంపాదించడం మొదలుపెట్టినప్పుడు కుటుంబం, ముఖ్యంగా తల్లిదండ్రులు భవిష్యత్తు అవసరాల కోసం డబ్బు ఆదా చేయమని మనల్ని ప్రోత్సహిస్తారు. ఆ తర్వాత స్నేహితులు, సహోద్యోగులు ఆర్థిక ప్రణాళికను ఎలా రూపొందించాలో సలహా ఇస్తారు. అందులో జీవిత బీమా కూడా ఉంటుంది. మరీ ప్రత్యేకంగా మీకు మార్గనిర్దేశం చేసేవారు, ఆర్థిక భరోసా కోసం టర్మ్ బీమాను తీసుకోమని మిమ్మల్ని సూచిస్తారు. ప్రస్తుతం టర్మ్ ఇన్సూరెన్స్ పొందాలంటే ఆన్‌లైన్‌లో సులభంగా కొనుగోలు చేసే మార్గాలున్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే, టర్మ్ బీమా గురించి ఇంకా అనేక ముఖ్యమైన అంశాలు కూడా మీరు తెలుసుకోవాలి. మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఈ బీమా ఉత్పత్తికి సంబంధించిన కొన్ని కీలకమైన అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!

టర్మ్ బీమా అంటే..

ముందుగా టర్మ్ బీమా అంటే ఏంటనే ప్రాథమిక విషయం తెలుసుకుందాం. ఇది ఒక రకమైన జీవిత బీమా. ఎంచుకున్న కాలానికి జీవిత బీమా అందిస్తుంది. మీరు టర్మ్ బీమా తీసుకుంటే, ఏదైనా అనుకోని ప్రమాదం సంభవించినపుడు నామినీలుగా ఉన్నవారికి డెత్ బెనెఫిట్స్ అందుతాయి. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాథమిక ఉద్దేశ్యం మీ మరణం కారణంగా తలెత్తే ఆదాయ నష్టం నుంచి మీ కుటుంభసభ్యులకు ఆర్థిక భద్రత కల్పించడం.

టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరికి అవసరం?

దీనికి సమాధానం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. పాలసీదారు మరణిస్తే కుటుంబసభ్యులకు ఆర్థిక భద్రత కల్పించడానికి టర్మ్ ఇన్సూరెన్స్ ముఖ్యం. పాలసీదారు మరణం తర్వాత ఎదురయ్యే ఆదాయ నష్టం వల్ల పిల్లల ఉన్నత విద్య, వివాహం వంటి కుటుంబ లక్ష్యాలు కూడా ప్రభావితమవుతాయి. అంతేకాకుండా, గృహ రుణం లేదా వాహన రుణం వంటి వాటి కోసం తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉంటే, అది కుటుంబ సభ్యులకు అదనపు భారంగా మారుతుంది. వీటన్నింటినీ టర్మ్ ఇన్సూరెన్స్ ద్వారా చెల్లించి, కుటుంబానికి భరోసా అందించవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే, మీకు టర్మ్ ఇన్సూరెన్స్ అవసరమా లేదా అనేది మీ కుటుంబం ఆర్థిక లక్ష్యాలు, మీపై ఆధారపడిన, మీ బాధ్యతలపై ఆధారపడి ఉంటుంది. అదనంగా, కొన్ని టర్మ్ ప్లాన్‌లు అనారోగ్యం వంటి జీవనశైలి ప్రమాదాలనూ కవర్‌ చేస్తున్నాయి. దీని ప్రకారం, గుండె జబ్బులు లేదా క్యాన్సర్ వంటి జీవనశైలి సంబంధిత వ్యాధుల ప్రమాదంలో ఉన్నట్లు భావిస్తే, టర్మ్ ప్లాన్‌ సరైన నిర్ణయంగా భావించవచ్చు.

ఏ వయస్సులో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి

దీనికి సమాధానం సులభం.. మీపై ఆధారపడినవారు, కుటుంబ అవసరాలు లేదా బాధ్యతలు ఉన్నాయనుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను పొందవచ్చు. వయస్సు పెరిగే కొద్దీ, అదే కవరేజీ కోసం చెల్లించే ప్రీమియం పెరుగుతుంది. ఉదాహరణకు, 30 ఏళ్ల ధూమపానం చేయని వ్యక్తి అయితే, 60 ఏళ్ల వయస్సు వరకు రూ. 1 కోటి కవర్‌కు టర్మ్ ఇన్సూరెన్స్ పొందవచ్చు, దీనికి వార్షిక ప్రీమియం రూ. 7,400 అవుతుంది. అదే, 45 ఏళ్ల వయసులో తీసుకోవాలని భావిస్తే అదే కవరేజీ కోసం దాదాపు రూ. 14,700 ప్రీమియం అవుతుంది. ఇక్కడ, మీకు టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ ఎంతకాలం అవసరమో కూడా ఆలోచించాలి. సాధారణంగా, పదవీ విరమణ వయస్సు వరకు లేదా మీపై ఆర్థికంగా ఆధారపడినవారి కోసం, రుణాలు వంటి ఆర్థిక బాధ్యతలు ఉన్నంత వరకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉండటం మంచిది.

ఏది ఉత్తమమో ఎలా ఎంచుకోవాలి?

మొదట, కవరేజ్ పరంగా, మీకు 45 కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే మీ వార్షిక ఆదాయానికి 20 రెట్లు వరకు కవరేజీ ఎంచుకోవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. 45 కంటే ఎక్కువ వయస్సు ఉంటే, కవరేజ్ మీ వార్షిక ఆదాయానికి దాదాపు 15 రెట్లు ఉండాలి.

ఇక, ప్రీమియం చెల్లించే షెడ్యుల్ ముఖ్యమైన అంశం. ఈ రోజుల్లో టర్మ్ ప్లాన్‌లు నెలవారీ, త్రైమాసిక లేదా వార్షిక ప్రాతిపదికన ప్రీమియంలను చెల్లించడానికి బీమా సంస్థలు సదుపాయం కల్పిస్తున్నాయి. ప్రీమియం చెల్లించడానికి మీ ఖాతా నుండి సమయానికి పూర్తయ్యేలా బ్యాంకుకు స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ కోసం కోరవచ్చు. మీ పాలసీకి ఒకేసారి ప్రీమియం చెల్లించడానికి అనుమతించే ప్లాన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు, నెలవారీ, త్రైమాసిక లేదా వార్షికంగా రెగ్యులర్ ప్రీమియం చెల్లింపు ప్రక్రియ వేతజీవులకు ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. మరోవైపు, ఏదైనా స్వయం ఉపాధి ఉన్న వ్యక్తి అయితే, సింగిల్-ప్రీమియం టర్మ్ ప్లాన్‌ను పొందవచ్చు.

చివరగా, బీమా సంస్థను ఎంచుకునే ముందు, కంపెనీ పనితీరును కూడా పరిశీలించడం ముఖ్యం. బీమా కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ నిష్పత్తిని సులభంగా తెలుసుకోవచ్చు, ఇది కంపెనీ ఎంత తరచుగా క్లెయిమ్‌లను చెల్లిస్తుందో, తిరస్కరిస్తుందో తెలుస్తుంది.

బీమా కంపెనీ ఎంపిక

ఇంతటి ముఖ్యమైన పాలసీని తీసుకోవాలని భావించినప్పుడు ఏ బీమా సంస్థను ఎంచుకోవాలనే సందేహం ఉండొచ్చు. దీనికోసం..

క్లెయిం చెల్లింపులు: అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీ కుటుంబానికి క్లెయిమ్‌ను సకాలంలో చెల్లించడం చాలా ముఖ్యం. బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఏటా క్లెయిమ్ చెల్లింపుల నిష్పత్తి ఉంటుంది. ఇందులో 98 శాతం పైన క్లెయిమ్ చెల్లింపుల నిష్పత్తి ఉన్న సంస్థలను ఎంచుకోవచ్చు.

ఆర్థిక బలం: బీమా అనేది దీర్ఘకాలిక ఒప్పందం. బీమా ఎంచుకున్న కాలవ్యవధిలో సదరు బీమా సంస్థ దివాలా తీయకుండా ఉంటుందనే భరోసా అవసరం. అందుకే, కంపెనీ స్వాల్వెన్సీ నిష్పత్తిని చూడటం ముఖ్యం. ఈ నిష్పత్తి కనీసం 1.5(150 శాతం) కంటే ఎక్కువగా ఉండాలి.

ఫిర్యాదులు: ఐఆర్‌డీఏఐ సైటులో బీమా సంస్థపై ఉన్న ఫిర్యాదుల గురించి కూడా వివరాలు లభిస్తాయి. సాధారణంగా 10 వేల పాలసీలకు 5 కంటే తక్కువ ఫిర్యాదులు ఉంటే, అది మంచి కంపెనీగా భావిస్తారు. అంతకంటే ఎక్కువ ఉంటే జాగ్రత్త అవసరం.

తక్కువ ప్రీమియం: కొన్ని కంపెనీలు తక్కువ ప్రీమియం ఇస్తున్నాయని, అవి తీసుకుంటే క్లెయిమ్ చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. కాబట్టి, ఎంత ప్రీమియం చెల్లిస్తున్నామనే దాంతో సంబంధం లేకుండా మెరుగైన పాలసీ ప్రయోజనాలు అందించే వాటిని ఎంచుకోవడం మంచిది.

Next Story