జనవరి-మార్చి త్రైమాసిక ఇళ్ల అమ్మకాల్లో 14 శాతం వృద్ధి!

by Disha Web Desk 12 |
జనవరి-మార్చి త్రైమాసిక ఇళ్ల అమ్మకాల్లో 14 శాతం వృద్ధి!
X

ముంబై: ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో దేశవ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు మెరుగైన వృద్ధిని సాధించాయి. ప్రముఖ రియల్టీ కన్సల్టెంట్ సంస్థ అనరాక్ గ్రూప్ తాజా వివరాల ప్రకారం, దేశంలో వడ్డీ రేట్లు ప్రభావం, ఇళ్ల ధరలు 6-9 శాతం మేర పెరిగినప్పటికీ గణనీయమైన డిమాండ్ కారణంగా ప్రధాన ఏడు నగరాల్లో 2023 మొదటి త్రైమాసికంలో గృహ విక్రయాలు 14 శాతం పెరిగి 1.13 లక్షల యూనిట్లకు చేరుకోనున్నాయి.

గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ స్థిరాస్తి రంగంలో ముఖ్యంగా నివాస విభాగంలో సానుకూల వాతావరణం ఉందని, దానివల్ల గత దశాబ్ద కాలంలోనే అధిక త్రైమాసిక ఇళ్ల అమ్మకాలు నమోదయ్యాయని అనరాక్ తెలిపింది. దేశంలోని ప్రధాన ఏడు నగరాల్లో సమీక్షించిన త్రైమాసికానికి సంబంధించి 1,13,770 యూనిట్లు విక్రయించబడ్డాయి. ఇది గత ఏడాది కంటే 14 శాతం ఎక్కువ. అందులో ముంబై మెట్రో, పూణెలు(48 శాతం) అత్యధిక వాటా సొంతం చేసుకున్నాయి.

ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో అమ్మకాలు తక్కువగా ఉంటాయని నివేదిక అంచనా వేసింది. రూ. 1.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన అధిక ధరల గల ఇళ్లకు గిరాకీ పెరిగిందని అనరాక్ చైర్మన్ అనుజ్ పూరి చెప్పారు. అయితే, అధిక ద్రవ్యోల్బణం కొనసాగుతుండటం, ఆర్‌బీఐ మరోసారి కీలక వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాల మధ్య రానున్న రెండు త్రైమాసికాల వరకు గృహ అమ్మకాల విభాగం కొంత ఒత్తిడి లో ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. జనవరి-మార్చికి సంబంధించి ముంబై మెట్రో లో ఇళ్ల అమ్మకాలు 19 శాతం, పూణెలో 42, బెంగళూరులో 16 శాతం, హైదరాబాద్‌లో 9 శాతం, చెన్నైలో 18 శాతం, కోల్‌కతాలో 3 శాతం వృద్ధి నమోదవుతాయని, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో మాత్రం 9 శాతం క్షీణత ఉంటుందని అనరాక్ అంచనా వేసింది.


Next Story

Most Viewed