HDFC Bank: మరోసారి ఎఫ్‌డీ రేట్లు తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

by S Gopi |   (  Updated:2025-05-26 12:43:48  IST  )

రూ. 3 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీలపై ఈ మేరకు వడ్డీని తగ్గించింది.

HDFC Bank: మరోసారి ఎఫ్‌డీ రేట్లు తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మరోసారి డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. గత రెండు పర్యాయాలు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. దీని ఆధారంగా బ్యాంకులు డిపాజిట్లు, రుణాలపై వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. ఇదివరకే ఏప్రిల్ నెలలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల(ఎఫ్‌డీ)పై 50 బేసిస్ పాయింట్లను తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఇప్పుడు మరోసారి 20 బేసిస్ పాయింట్లు తగ్గించినట్టు ప్రకటించింది. బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ వివరాల ప్రకారం, రూ. 3 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీలపై ఈ మేరకు వడ్డీని తగ్గించింది. సవరించిన రేట్లు మే 23 నుంచే అమల్లోకి వచ్చాయని బ్యాంకు స్పష్టం చేసింది. సాధారణ ఖాతాదారులకు కొత్త రేట్లు 3-6.85 శాతం మధ్య అమలవుతాయి. సీనియర్ సిటిజన్‌లకు 3.5 శాతం నుంచి 7.35 శాతం మధ్య రాబడి బ్యాంకు ఇస్తుంది. సవరించిన రేట్లు కొన్ని కాలవ్యవధులకు మాత్రమే అమలయ్యాయి. వాటిలో ఏడాది నుంచి 15 నెలల కాలానికి 10 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 6.60 శాతం నుంచి 6.50 శాతానికి చేరింది. 18 నెలల నుంచి 21 నెలల కాలానికి 20 బేసిస్ పాయింట్లను తగ్గించడంతో 7.05 శాతం నుంచి 6.85 శాతానికి, రెండేళ్ల నుంచి మూడేళ్ల కాలవ్యవధికి సంబంధించి 20 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో 6.90 శాతం నుంచి 6.70 శాతానికి చేరింది. సీనియర్ సిటిజన్‌లకు కూడా ఇదే తీరులో వడ్డీ రేట్ల తగ్గింపు వర్తిస్తుంది.

Next Story