GDP Data: జీడీపీ డేటా విడుదల తేదీ మార్పు

by S Gopi |

డేటా నాణ్యతను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో, నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ అడ్వైజరీ కమిటీ(ఏసీఎన్ఏఎస్)తో సంప్రదింపుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

GDP Data: జీడీపీ డేటా విడుదల తేదీ మార్పు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశ జీడీపీ గణాంకాల విడుదల షెడ్యూల్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఇప్పటివరకు ప్రతి సంవత్సరం మే చివరి వర్కింగ్ రోజున విడుదలయ్యే తాత్కాలిక వార్షిక జీడీపీ అంచనాలు, నాల్గవ త్రైమాసిక (జనవరి-మార్చి) జీడీపీ డేటాను ఇకపై జూన్ 7న విడుదల చేయనున్నారు. ఒకవేళ జూన్ 7 సెలవుదినం అయితే, దానికి ముందు వర్కింగ్ రోజు ఈ గణాంకాలు ప్రకటిస్తామని గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (మోస్పీ) తెలిపింది. డేటా నాణ్యతను మరింత మెరుగుపరచాలనే ఉద్దేశంతో, నేషనల్ అకౌంట్ స్టాటిస్టిక్స్ అడ్వైజరీ కమిటీ(ఏసీఎన్ఏఎస్)తో సంప్రదింపుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మార్పుకు ప్రధాన కారణం కీలక ఆర్థిక డేటా ఆలస్యంగా అందుబాటులోకి రావడమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. లిస్టెడ్ కంపెనీలు తమ నాల్గవ త్రైమాసిక ఆడిటెడ్ ఫలితాలను సమర్పించేందుకు ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత 60 రోజుల వరకు సమయం ఉంటుంది. ఎక్కువ సంస్థలు మే చివర్లోనే వివరాలు అందిస్తున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు, సబ్సిడీలు, మూలధన వ్యయం, వడ్డీ చెల్లింపులు వంటి కీలక గణాంకాలు కూడా రెండు నెలల తర్వాతే ఖరారవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరింత ఖచ్చితమైన, పటిష్టమైన జాతీయ ఖాతాల గణాంకాలను అందించేందుకు షెడ్యూల్‌ను సవరించినట్లు ఎన్ఎస్ఓ పేర్కొంది.

Next Story