PSBs: పీఎస్‌బీల్లో విదేశీ పెట్టుబడుల పరిమితిని పెంచే యోచనలో ప్రభుత్వం

by S Gopi |

ఈ విషయంపై గత రెండు నెలలుగా భారతీయ రిజర్వ్ బ్యాంకు(ఆర్‌బీఐ)తో ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది.

PSBs: పీఎస్‌బీల్లో విదేశీ పెట్టుబడుల పరిమితిని పెంచే యోచనలో ప్రభుత్వం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిమితిని ఏకంగా రెట్టింపు కంటే ఎక్కువ 49 శాతానికి చేర్చడంపై పరిశీలిస్తున్నదని సంబంధిత వ్యక్తులు చెప్పినట్టు జాతీయ మీడియా కథనం పేర్కొంది. ఈ విషయంపై గత రెండు నెలలుగా భారతీయ రిజర్వ్ బ్యాంకు(ఆర్‌బీఐ)తో ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. ఈ ప్రతిపాదన ఇంకా ఖరారు కాలేదని సదరు వ్యక్తి స్పష్టం చేశారు.

ఇటీవల ప్రైవేట్ బ్యాంకులైన ఆర్‌బీఎల్, యెస్ బ్యాంకుల్లో విదేశీ కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టాయి. దుబాయ్‌కు చెందిన ఎమిరేట్స్ ఎన్‌బీడీ ఇటీవల ఆర్‌బీఎల్ బ్యాంకులో 60 శాతం వాటాను 3 బిలియన్ డాలర్ల(రూ. 26 వేల కోట్లకు పైగా) ఖర్చుతో కొనుగోలు చేసింది. సుమిటోమో మిట్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ యెస్ బ్యాంకులో 20 శాతం వాటాను 1.6 బిలియన్ డాలర్ల(రూ. 14 వేల కోట్ల)కు సొంతం చేసుకుంది. ఆ తర్వాత మరో 4.99 శాతం వాటాను పెంచుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్‌బీ) కూడా విదేశీ పెట్టుబడిదారుల నుంచి ఆసక్తి పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో పీఎస్‌బీల్లో విదేశీ పెట్టుబడులకు ఉన్న పరిమితిని పెంచడం ద్వారా మరింత మూలధనం ఆయా బ్యాంకులకు లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రతిపాదన కేవలం మూలధన సేకరణ కోసమే కాకుండా పీఎస్‌బీలు, ప్రైవేట్ బ్యాంకుల నిబంధనల మధ్య అంతరాన్ని తగ్గించే ప్రయత్నంలో కూడా భాగమని తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలోని ప్రైవేట్ బ్యాంకుల్లో 74 శాతం వరకు విదేశీ పెట్టుబడులకు అనుమతి ఉంది. దీనిపై ప్రభుత్వం గానీ, ఆర్‌బీఐ గానీ స్పందించాల్సి ఉంది.

Next Story