Online Gaming: ఆన్‌లైన్‌ గేమింగ్ బిల్లుకు కేబినెట్ ఆమోదం

by S Gopi |

బుధవారం దీన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.

Online Gaming: ఆన్‌లైన్‌ గేమింగ్ బిల్లుకు కేబినెట్ ఆమోదం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో అత్యంత వేగంగా పెరుగుతున్న బెట్టింగ్ యాప్‌ల నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ను నేరమని పేర్కొంటూ ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లు తీసుకొచ్చింది. మంగళవారం ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లును కేబినెట్ ఆమోదించింది. బుధవారం దీన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లును తీసుకురావడం ద్వారా దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ గేమింగ్ రంగాన్ని చట్టపరంగా నియంత్రించడం, ఆన్‌లైన్ బెట్టింగ్‌ను నిలిసే లక్ష్యంతో తీసుకొచ్చారు. ఈ బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని రకాల రియల్ మనీ గేమింగ్‌ను పూర్తిగా నిషేధించే అవకాశం ఉంది. దేశంలో అనేక బెట్టింగ్ యాప్‌లు చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా విదేశాల నుంచి వీటిని ఆపరేట్ చేస్తూ మనదేశ నిబంధనలను పాటించకుండా పన్నులు ఎగవేస్తున్నాయి. దీనివల్ల సామాన్యులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పైగా, ఈ యాప్‌ల ప్రచారం కోసం కంపెనీలు సెలబ్రిటీలను ఎంచుకోవడంతో యువతే వీటికి ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. ఇటీవల ఆన్‌లైన్ మోసాల కేసుల దర్యాప్తు సందర్భంగా ఈ యాప్‌లను ప్రచారం చేస్తున్న ప్రముఖులు సైతం దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి చర్యలను అరికట్టేందుకు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను చట్ట పరిధిలోకి తీసుకురానున్నారు. తద్వారా ఉచిత గేమ్‌లు, నగదు చెల్లింపు గేమ్‌లను విడిగా కనుక్కోవచ్చు. అలాగే, సెలబ్రిటీలు, ఏవైనా సంస్థలు చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడానికి వీలుండదు. ఈ దీపావళికి ఆన్‌లైన్ గేమింగ్‌పై 40 శాతం జీఎస్టీ విధిచే అవకాశం కూడా ఉందని సమాచారం.

Next Story