Nirmala Sitaraman: బంగారం, వెండి దిగుమతులపై ఆందోళన అక్కరలేదు

by S Gopi |

ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు బంగారం ధరలను పరిశీలిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు భారీగా కొనుగోళ్లు చేయడమే బంగారం ధరల పెరుగుదలకు కారణమన్నారు.

Nirmala Sitaraman: బంగారం, వెండి దిగుమతులపై ఆందోళన అక్కరలేదు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇదే సమయంలో బంగారం ధరలను ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు. సాంప్రదాయంగా పండుగ సీజన్‌లో వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి, కానీ ఇప్పటివరకు నిర్దిష్ట పరిమితులను దాటలేదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) బోర్డు డైరెక్టర్లతో బడ్జెట్ తర్వాత జరిగే సాధారణ సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు బంగారం ధరలను పరిశీలిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు భారీగా కొనుగోళ్లు చేయడమే బంగారం ధరల పెరుగుదలకు కారణమన్నారు. దిగుమతుల గురించి ఆందోళన అక్కరలేదు, కరెంట్‌ ఖాతా లోటు నిర్వహించే స్థాయిలోనే ఉందన్నారు. పసిడి మనదేశంలో ఒక పెట్టుబడి సాధనంగా ఉంటుంది, పండుగ సీజన్‌లో హెచ్చుతగ్గులు సాధారణం. కాబట్టి, ఈ పరిస్థితులను తాము గమనిస్తున్నామని వివరించారు. ఆర్‌బీఐ కూడా ధరల హెచ్చుతలను గమనిస్తూ ఉంటుంది. అనేక దేశాలు, ముఖ్యంగా వివిధ సెంట్రల్ బ్యాంకులు బంగారం, వెండిని కొని, నిల్వ చేస్తున్నాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

యూఎస్ టారిఫ్ గురించి

ఈ సందర్భంగా అమెరికా టారిఫ్ అంశంపై ఆర్థిక మంత్రి స్పందించారు. ఈ విషయాన్ని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సమీక్షిస్తోందన్నారు. ఇప్పటికిప్పుడు టారిఫ్‌ల అంశంపై మాట్లాడటం తొందరపాటు అవుతుంది. తదుపరి చర్చలకు ఎప్పుడు వెళ్లాలో ప్రతినిధుల బృందం నిర్ణయం తీసుకోవల్సి ఉంటుంది. కాబట్టి తాను వ్యాఖ్యానించడం కూడా తొందరపాటేనని సీతారామన్ అన్నారు. గత శుక్రవారం (ఫిబ్రవరి 20) అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ ప్రభుత్వం వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ​​విధించిన భారీ దిగుమతి సుంకాలకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత, ట్రంప్ ఫిబ్రవరి 24 నుంచి 150 రోజుల పాటు భారత్‌తో సహా అన్ని దేశాలపై 10 శాతం సుంకాన్ని విధించారు. అనంతరం శనివారం (ఫిబ్రవరి 21) ఈ సుంకాలను 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు.

Next Story