కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-06 12:13:57  IST  )

6-7 గంటల్లోనే బంగారం ధరలు రెండుసార్లు తగ్గాయి. దీంతో కొనుగోలుదారులకు ధరల నుంచి భారీ ఊరట లభించినట్లైంది.

కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది నిజంగానే శుభవార్త. ఈరోజు ఉదయం బంగారం ధరలు తగ్గగా.. సాయంత్రం కూడా తగ్గడంతో బంగారం రేటు మరింత దిగొచ్చింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై ఉదయం రూ.770 తగ్గగా.. సాయంత్రం 4 గంటల తర్వాత రూ.980 తగ్గింది. దీంతో ధర రూ.1,61,130కి దిగొచ్చింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై ఉదయం రూ.770 పతనమవ్వగా.. సాయంత్రం మరో రూ.900 తగ్గింది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,47,700గా నమోదైంది. కిలో వెండి ధర మాత్రం ఉదయం మాదిరిగానే రూ.2,90,000 వద్ద కొనసాగుతోంది. ఐదురోజుల్లోనే బంగారం ధర రూ.11,960 నుంచి రూ.10,950 మేర తగ్గింది. ఈ సమయంలో బంగారం కొనుగోలు చేసేవారికి ఇది భారీ ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. ప్రస్తుతం పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు చేసుకునేవారికి బంగారం ధరల తగ్గుదల బిగ్ రిలీఫ్ ను ఇస్తోంది. తగ్గిన ధరలకు జీఎస్టీ, తరుగు అదనంగా ఉంటుంది. హైదరాబాద్ సహా.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు.

ధరల తగ్గుదలకు కారణమేంటి?

ఇజ్రాయెల్ - అమెరికా దేశాలపై ఇరాన్ యుద్ధం చేస్తోంది. నిజానికి ఈ సమయంలో బంగారం ధరలు ఊహించని రీతిలో పెరగాలి. కానీ అందుకు భిన్నంగా వరుసగా ఐదురోజులుగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. రికార్డులను చూస్తే.. ఫిబ్రవరి 28 నుంచి యుద్ధం ప్రారంభమవ్వగా.. ఫిబ్రవరి 27, 28, మార్చి 1న బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ మూడురోజుల్లోనే ధర రూ.12,070 నుంచి రూ.11,050 వరకూ పెరిగింది. భవిష్యత్తులోనూ ఇదే పరిస్థితి ఉంటుందని, బంగారం ధర అతిత్వరలోనే రూ.2,00,000 మార్కును అందుకుంటుందని నిపుణులు అంచనా వేశారు. కానీ.. సీన్ రివర్సైంది. బంగారం, వెండి ధరలు తగ్గడానికి కారణం ఇన్వెస్టర్లు తమ లాభాలను తీసుకోవడం ఒక కారణంగా చెప్తున్నారు.

మరోవైపు డాలర్ బలపడుతోంది. యుద్ధం వల్ల ముడి చమురు (Crude Oil) ధరలు పెరిగాయి. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం (Inflation) పెరుగుతుంది. దీనివల్ల అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం తక్కువని మార్కెట్ భావిస్తోంది. ఈ పరిణామంతో అమెరికన్ డాలర్, ట్రెజరీ బాండ్లు బలోపేతం అయ్యాయి. సాధారణంగా డాలర్ బలపడితే, ఇన్వెస్టర్లు బంగారం నుండి పెట్టుబడులను డాలర్ వైపు మళ్లిస్తారు. దీనివల్ల బంగారం ధరలు తగ్గుతాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. యుద్ధం కారణంగా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. పెద్ద ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లలో వచ్చిన నష్టాలను భర్తీ చేసుకోవడానికి (Liquidity కోసం), తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించడం కూడా ధరల తగ్గుదలకు ఒక కారణంగా కనిపిస్తోంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. గతంతో పోలిస్తే ఈ ఏడాది ప్రారంభంలో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు చేసే వేగాన్ని కొంచెం తగ్గించాయి. ఇది కూడా డిమాండ్‌పై ప్రభావం చూపింది.

తాత్కాలికమే.. జర భద్రం

కాగా.. బంగారం, వెండి ధరల తగ్గుదల తాత్కాలికమేనని, ఇన్వెస్టర్లు లాభాలు తీసుకోవడం ఆపి మళ్లీ ఇన్వెస్ట్ చేయడం, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం మరింత ముదరడం వంటి పరిణామాలు పెరిగితే ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అదే జరిగితే 10 గ్రామల బంగారం ధర రూ.2,00,000 తాకడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. సో.. బంగారం కొనాలనుకునేవారు ఆచితూచి వ్యవహరించాల్సిన సమయమిది.

Next Story