Gold: రూ.4,000 తగ్గిన బంగారం ధర

by S Gopi |

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో, అమెరికన్ డాలర్ బలపడటం, పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతినడంతో పసిడి ధరలు మరోసారి క్షీణించాయి

Gold: రూ.4,000 తగ్గిన బంగారం ధర
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బంగారం ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో, అమెరికన్ డాలర్ బలపడటం, పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతినడంతో పసిడి ధరలు మరోసారి క్షీణించాయి. అంతకుముందు రోజు పెరిగినట్టే కనిపించిన బంగారం గురువారం తిరిగి పడిపోయింది. ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం తీవ్రమయ్యే అవకాశం ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల తర్వాత అమెరికన్ డాలర్ బలపడటంతో, విలువైన లోహాల ధరలు తగ్గాయని విశ్లేషకులు తెలిపారు. ఈ క్రమంలోనే దేశ రాజధాని ఢిల్లీలో స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,49,120 వద్ద ఉంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములు రూ. 3,980 క్షీణించి రూ. 1,49,070 వద్ద, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి పది గ్రాములు రూ. 3,650 పడిపోయి 1,36,550కి చేరాయి. వెండి కూడా రూ. 5,000 మేర దిగిరావడంతో కిలో రూ. 2.50 లక్షలకు చేరింది. గ్లోబల్ మార్కెట్లలోనూ ధరలు తగ్గుముఖం పట్టాయి. స్పాట్ గోల్డ్ దాదాపు రెండున్నర శాతం మేర తగ్గి 4,670 డాలర్లకు, వెండి 3.60 శాతం పడిపోయి 72 డాలర్ల వద్ద ఉంది.

రూపాయికి ఆర్‌బీఐ సపోర్ట్

భారత కరెన్సీపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తీసుకున్న చర్యలతో రూపాయి విలువ 12 ఏళ్లలోనే అతిపెద్ద రికవరీని చూసింది. ముఖ్యంగా బ్యాంకుల ఓవర్‌నైట్‌ నెట్ ఓపెన్ పొజిషన్‌లను 100 మిలియన్ డాలర్లకు పరిమితం చేయడంతో పాటు ఇతర చర్యలతో మనదేశ రూపాయి ఏకంగా 165 పైసలకు పైగా పుంజుకుంది. 2013 సెప్టెంబర్ తర్వాత ఇదే అతిపెద్ద సింగిల్-డే రికవరీ. దీంతో గురువారం సాయంత్రం సమయానికి అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 92.99కి చేరింది.

Next Story